
టోల్‌ఫ్రీ కాల్ సెంటర్ నుంచి మాట్లాడుతున్న పొంగులేటి
ఇందిరమ్మ లబ్ధిదారులతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి పొంగులేటి
ఇందిరమ్మ ఇళ్ల కాల్ సెంటర్ ప్రారంభం
టోల్ ఫ్రీ నంబర్ 1800 599 5991
సాక్షి, హైదరాబాద్: ‘హలో... నేను గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని మాట్లాడుతున్నా. మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచి్చన ఇల్లు వచి్చందా.. దానికి సంబంధించిన బిల్లులు వస్తున్నాయా.. ఇంటి శ్లాబ్ ఎక్కడి వరకు వచ్చింది..అధికారులు మీకు సహకరిస్తున్నారా’అంటూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు. గురువారం మంత్రి హైదరాబాద్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ కాల్ సెంటర్, హెల్ప్‌డెస్‌్క, ఇందిరమ్మ ఇళ్ల కాల్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులతో ఫోన్‌లో మాట్లాడారు.
ముందుగా వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండలం లబ్ధిదారుతో మాట్లాడారు. ‘బేస్‌మెంట్ వరకు మా ఇల్లు పూర్తయింది. కానీ ఇంకా బిల్లు రాలేదు’అని ఆమె చెప్పారు. దీనికి మంత్రి స్పందిస్తూ బేస్‌మెంట్ పూర్తయి ఎన్ని రోజులైంది, దాని ఫొటోలు అప్‌లోడ్ చేశారా అని అడిగారు. అప్పుడు అక్కడే ఆధార్ నంబర్‌తో అన్నీ పరిశీలించారు. రూ.లక్ష వచ్చే సోమవారం మీ బ్యాంక్ అకౌంట్‌లో పడతాయని పొంగులేటి చెప్పారు. మరో వ్యక్తి ఫోన్ చేసి గ్రేటర్ హైదరాబాద్‌లో ఎప్పుడు ఇళ్లు ఇస్తారని అడగ్గా, పొంగులేటి స్పందిస్తూ నగరంలో స్థల సమస్య ఉందని, త్వరలోనే పరిష్కారం కనుగొని అర్హులందరికీ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు.
ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు
టోల్‌ఫ్రీ కాల్ సెంటర్ ఫోన్ 1800 599 5991 రోజూ ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తుందని మంత్రి పొంగులేటి అన్నారు. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించడంతోపాటు వాటిని పరిష్కరించడంలో చొరవ చూపడానికి ఈ కాల్ సెంటర్ ను వినియోగించుకోవచ్చన్నారు. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, వాటిని సంబంధిఅగీత అధికారుల వద్దకు తీసుకెళ్లి చర్యలు తీసుకుని లబ్ధిదారులకూ ఆ వివరాలను తెలియచేస్తారని పొంగులేటి చెప్పారు. అవినీతికి ఆస్కారం లేకుండా ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్లలో దేశానికే తెలంగాణ ఆదర్శం
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కలి్పంచడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం తన నివాసంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు తదితరులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈ నెల 15వ తేదీన కామారెడ్డిలో నిర్వహించనున్న బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం కృషి చేస్తుంటే, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అడ్డుకుంటోందని సమావేశంలో మంత్రులు అభిప్రాయపడ్డారు.