
సవ్యమైన జాబితాకు సహకరించండి!
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై పార్టీల ప్రతినిధుల సమావేశంలో కర్ణన్
సాక్షి, సిటీబ్యూరో: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ఓటర్ల తుది జాబితాను సవ్యంగా సిద్ధం చేసేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ కోరారు. సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సంక్షిప్త సవరణకు సంబంధించి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఇంటిగ్రేటెడ్ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ఈ నెల 2వ తేదీన ప్రచురించామన్నారు. ఆ మేరకు నియోజకవర్గంలోని 139 లొకేషన్లలో 407 పోలింగ్‌స్టేషన్ల పరిధిలో 3 లక్షల 92 వేల 669 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఈ వివరాలతో కూడిన జాబితాను అన్ని రాజకీయ పార్టీలకు అందజేసినట్లు చెప్పారు. తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ), జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్లలో కూడా అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
పోలింగ్ ఏజెంట్లను నియమించాలి
ప్రతి పోలింగ్ కేంద్రానికి బూత్ లెవల్ ఏజెంట్ల(బీఎల్‌ఏ)ను నియమించి, జాబితా సవరణ పారదర్శకంగా, ఖచ్చితంగా ఉండేందుకు భాగస్వాములు కావాలని పార్టీల ప్రతినిధులను కోరారు.
ఓటరుగా నమోదు చేసుకోండి
దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 17 వరకు అవకాశం ఉందని, ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న, అర్హులైన పౌరులు ఆ తేదీలోగా తప్పనిసరిగా ఓటరుగా నమోదయ్యేలా చూడాలని రాజకీయ పార్టీలను కర్ణన్ కోరారు. జాబితాలో సవరణలు, మార్పులు చేర్పులు చేయాలనుకున్నా అదే తేదీ(సెప్టెంబర్ 17)లోపు దరఖాస్తు ఫారాలు సమర్పించాలన్నారు.
ఈ నెల 30న తుది జాబితా
ఇప్పటివరకు ఫారం–6, 6ఎ, 7, 8ల ద్వారా వచ్చిన 2,855 దరఖాస్తులు, అభ్యంతరాల్లో 246 (8.62 శాతం) దరఖాస్తులను పరిష్కరించామని కర్ణన్ తెలిపారు. ఓటర్ల తుది జాబితాను సెప్టెంబర్ 30న ప్రచురించనున్నట్లు చెప్పారు. సమావేశానికి ఎల్‌బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు జాయింట్ సీఈఓ పల్లవి విజయ్‌వంశీ, అదనపు కమిషనర్(ఎలక్షన్స్) మంగతాయారు హాజరయ్యారు. నందేశ్ కుమార్(బహుజన్ సమాజ్ పార్టీ), పి.వెంకటరమణ, పవన్ కుమార్(భారతీయ జనతా పార్టీ), విజయ్ మల్లంగి (ఆమ్ ఆద్మీ పార్టీ), ఎం.శ్రీనివాసరావు (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా–మార్క్సిస్టు), రాజేశ్ కుమార్ (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్), వై.జయసింహ, కె.మాధవ్ (భారత్ రాష్ట్ర సమితి), కె.జోగేందర్ సింగ్, ప్రశాంత్ యాదవ్ (తెలుగుదేశం పార్టీ), సయ్యద్ ముస్తాక్ (ఎఐఎంఐఎం) తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి ముందు హైదరాబాద్ జిల్లాలో జీఐఎస్ ఆధారిత నజరి నక్ష తయారీ కార్యాచరణ ప్రణాళికపై కర్ణన్ రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించారు.