
సాక్షి ఎడిటర్, జర్నలిస్టులపై కేసులు సరికాదన్న రాజకీయ, ప్రజాసంఘాల నేతలు
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం మీడియా, ప్రతిపక్షాల గొంతు నొక్కొద్దు
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష పార్టీల గళాన్ని వినిపిస్తున్న పత్రికలపై ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు ధోరణిపై ప్రజా సంఘాల నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వానికి వినిపించడమే ప్రతిపక్ష పార్టీల కర్తవ్యమని, పత్రికలు, మీడియా బాధ్యత కూడా ఇదేనన్నారు. కానీ ప్రజా సమస్యలను వినిపించుకోకుండా ఏకపక్షంగా గొంతు నొక్కే ప్రయత్నం ప్రజా క్షేత్రంలో చెల్లుబాటు కాదని హెచ్చరించారు. సాక్షి మీడియాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా తప్పుబట్టారు.
పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు
ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రజాస్వామ్య విలువలకు ప్రతిబింబమే పత్రికా స్వేచ్ఛ. సామాజిక మాధ్యమాల యుగంలో ప్రెస్‌మీట్‌ను వక్రీకరించకుండా యథాతథంగా ప్రచురించడం సంపాదకుడి బాధ్యత. సాక్షి ఎడిటర్‌గా తన విద్యుక్త ధర్మాన్ని పాటించిన ఆర్.ధనంజయరెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం సరైన చర్య కాదు. ఫిర్యాదులోని అంశాల్లో ఆధారాలు పరిశీలించకుండా కేసులు నమోదు చేయడం సరికాదు. పత్రికా సంప్రదాయాలు, విలువలు కాపాడేలా ప్రభుత్వం, అధికారులు వ్యవహరించాలి. నేతలు తమ పార్టీ విధానాలను వెల్లడిస్తే, వాటి ఆధారంగా ఎడిటర్‌పై కేసులు నమోదు చేయడం సరికాదు. – కేటీఆర్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
అఎడిటర్‌పై కేసులు పెట్టే సంస్కృతి ఏమిటి?
విలేకరుల సమావేశంలో ఒక నాయకుడు మాట్లాడిన అంశాలను పత్రికలో ప్రచురిస్తే.. పత్రిక సంపాదకునిపై ఏకంగా కేసు నమోదు చేయడం ఏమిటి? ఇదెక్కడ న్యాయం? ఏపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా, అందులో పనిచేసే వారిని, ఎడిటర్ ధనంజయరెడ్డిని వేధించేలా కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తిపై కేసు పెట్టొచ్చు కానీ... అది ప్రచురించిన సంపాదకునిపై కేసు పెట్టడం అధికార దుర్వినియోగమే. పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే అవుతుంది. ధనంజయరెడ్డిపై పెట్టిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలి. తన విధిని నిర్వర్తిస్తున్న సంపాదకునిపై కేసులు పెట్టే సంస్కృతికి కూటమి ప్రభుత్వం స్వస్తి పలకాలి. – టి.హరీశ్‌రావు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే
కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం
పత్రికా స్వేచ్ఛ మన ప్రజాస్వామ్యానికి నాలుగో మూల స్తంభం. కానీ తరచుగా పత్రికలు, జర్నలిస్టులపై, చివరకు ఎడిటర్లపైనా దూషణలతోపాటు భౌతిక దాడులు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఒక మీడియా సమావేశాన్ని ప్రచురించినందుకు సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేయడం కూడా ఇలాంటి కోవలోనికి వస్తుంది. విమర్శ హేతుబద్ధం కానప్పుడు, విమర్శ చేసినఅ∙వారిపై చట్టబద్ధ చర్య తీసుకోవడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ ఈ విషయంపై పత్రిక సంపాదకునిపై కేసు పెట్టడం కక్ష సాధింపు చర్యనే. దీనిని ఖండిస్తూ ఎడిటర్, ఇతర జర్నలిస్టులపైన నమోదు చేసిన కేసులను ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్నాం. దీనిపై ఎడిటర్ గిల్డ్ స్పందించాలని కోరుతున్నా. – విమలక్క, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు
ఇది కక్షసాధింపు ధోరణే
తెలుగు రాష్ట్రాల్లో పాలక పక్షాలు.. ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రతిపక్షాల గొంతును వినిపిస్తున్న మీడియాపైనా కక్షసాధింపు ధోరణి కనిపిస్తోంది. కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సంస్కృతి పెరగడం ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఈ ఆలోచన విధానం నుంచి ప్రభుత్వాలు బయటకు రావాలి. ప్రతిపక్షాల పాత్రను అణఅచివేయడం వారి స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్య రక్షణకు పెను ప్రమాదం. – సంధ్య, పీఓడబ్ల్యూ నేత
మీడియాపై కేసులు సరికాదు
ఉద్దేశ పూర్వకంగా మీడియాపై కేసులు పెట్టడం సరికాదు. మీడియాలో కేవలం పాలక పక్షం వార్తలే కాదు. ప్రతిపక్షం వార్తలు కూడా వస్తాయి. ప్రతిపక్ష పార్టీల వార్తలు రాసినందుకు మీడియాపై కేసులు నమోదు చేయడమంటే జర్నలిజంపైన దాడి చేయడమే. ఇది పూర్తిగా అక్రమం. ప్రతిపక్ష పార్టీ చేస్తున్న విమర్శలు సరికాకపోతే వాస్తవాలను వెల్లడించి రాజకీయ పోరాటం చేయాలి కానీ కేసులు పెట్టకూడదు. – ఎస్‌ఎల్ పద్మ, ప్రజాపంథ