
మెట్రో మహా విస్తరణ
2050 నాటికి 31 రూట్లు, 662 కి.మీ.
సాక్షి, సిటీబ్యూరో:
వచ్చే ఇరవై ఐదేళ్లలో మెట్రో మహా విస్తరణకు ముసాయిదా ప్రణాళిక సిద్ధమైంది. విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగర అవసరాలకు అనుగుణంగా 31 కారిడార్లలో 662 కి.మీ. వరకు పొడిగించే అవకాశం ఉంది. మాస్టర్‌ప్లాన్–2050లో భాగంగా హెచ్‌ఎండీఏ కాంప్రహెన్సివ్ మొబిలిటీప్లాన్(సీఎంపీ) కోసం లీ అసోసియేట్స్‌కు ముసాయిదా ప్రణాళిక రూపకల్పన బాధ్యతలను అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆ సంస్థ ముసాయిదా నివేదికను రూపొందించింది. త్వరలోనే తుది నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది. ఇప్పుడున్న మూడు కారిడార్‌లు, రెండోదశలో నిర్మించనున్న 8 కారిడార్‌లతో కలిపి 2050 నాటికి 31 కారిడార్‌లలో మెట్రో సదుపాయం అవసరమని పేర్కొంది. మహానగరం శరవేగంగా విస్తరిస్తున్న దృష్ట్యా, మెట్రో విస్తరణ ఎంతో కీలకమని తెలిపింది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 86 లక్షలకుపైగా వాహనాలు ఉన్నాయి. త్వరలో ఈ సంఖ్య కోటికి చేరనుంది. ప్రజారవాణా సదుపాయాలను విస్తరించడం ద్వారా మాత్రమే వ్యక్తిగత వాహనాలను ని యంత్రించవచ్చని లీ అసోసియేట్స్ స్పష్టం చేసింది.
దశలవారీగా విస్తరణ...
కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ కోసం 2024వ సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. ప్రస్తుతం నగర జనాభా 1.55 కోట్లు ఉన్నట్లు ఉంటుందని అంచనా. 2050 నాటికి 2.71 కోట్ల నుంచి 3.90 కోట్లకు చేరుకోవచ్చనే అంచనాల మేరకు 7,250 చ.కి.మీ.పరిధిలో మెట్రో విస్తరణకు ఈ సంస్థ ప్రణాళికలను రూపొందించింది. ట్రాఫిక్ సర్వే విశ్లేషణలు, జనాభా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, రవాణా సదుపాయాల డిమాండ్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని దశలవారీగా మెట్రో విస్తరించవలసి ఉంటుందని పేర్కొంది.
ఈ మేరకు ప్రస్తుతం 3 కారిడార్‌లలో 69 కి.మీ. వరకు మెట్రో సదుపాయం ఉంది. కొత్తగా ప్రతిపాదించిన రెండోదశ పూర్తయితే మరో 8 కారిడార్లలో మెట్రో అందుబాటులోకి రానుంది. దీంతో సుమారు 200 కి.మీ. వరకు మెట్రో సేవలు విస్తరిస్తాయి. ప్రస్తుతం 5 లక్షల మంది సేవలను వినియోగించుకుంటున్నారు. రెండో దశ పూర్తయితే మరో 10 లక్షల మందికి ఈ సదుపాయం లభించనుంది. 2040 నాటికి మెట్రో మూడోదశలో 340 కి.మీ.లు చేపట్టాలని లీ అసోసియేట్స్ సూచించింది. అప్పటివరకు మరో 15 లక్షల మందికిపైగా కొత్తగా వచ్చి చేరే అవకాశం ఉంది. 2050 నాటికి 662 కి.మీ. పూర్తి చేస్తే 75 లక్షల మందికిపైగా ప్రజలకు మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని ఆ సంస్థ అంచనా వేసింది.
హెచ్‌ఎంఏ డెవలప్‌మెంట్ ప్లాన్...
● హెచ్‌ఎండీఏ పరిధి విస్తరణతో ప్రస్తుతం 11 జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి, నల్లగొండ, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లాల్లోని 104 మండలాలు, 1,355 గ్రామాలతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా (హెచ్‌ఎంఏ) ఏర్పడింది.
● జాతీయ పట్టణ రవాణా పాలసీకి అనుగుణంగా భవిష్యత్తులో ప్రజారవాణా సదుపాయాలు, రహదారులు, మెట్రో వంటి ప్రాజెక్టుల విస్తరణ లక్ష్యంగా కాంప్రహెన్సివ్ మెబిలిటీ ప్లాన్(సీఎంపీ)ని సిద్ధం చేస్తున్నారు.
● ఈ మేరకు 2050 నాటికి మెట్రోరైలుకు ట్రాఫిక్ డిమాండ్ ఏ స్థాయిలో ఉండనుందనే అంశంపై ఆధారపడి మెట్రో విస్తరణకు ప్రణాళికలను రూపొందిస్తున్నారు.
మొదటి, రెండు దశలు కాకుండా లీ అసోసియేట్స్ ప్రతిపాదించిన రూట్లు (కి.మీ) ఇవే..
75 లక్షల మందికి పైగా ప్రయాణికులు
హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్–2050 ప్రణాళికలు
2030 నుంచి 2050 నాటికి దశలవారీగా విస్తరణ
7,257 చ.కి.మీ.పరిఽధిలో మెట్రో అవసరం
లీ అసోసియేట్స్ నివేదికలో వెల్లడి
ఈసీఐఎల్–కీసర: 12.6
ఆరాంఘర్–రేతిబౌలి: 10
ఓఆర్‌ఆర్ శంషాబాద్–కొత్తూర్–షాద్‌నగర్: 26
నానక్‌రాంగూడ జంక్షన్–నార్సింగ్–శంషాబాద్: 25.4
శంషాబాద్ ఓఆర్‌ఆర్–తుక్కుగూడ –పెద్దఅంబర్‌పేట్: 40
పెద్దఅంబర్‌పేట్– ఘట్కేసర్ –మేడ్చల్ జంక్షన్: 45
మేడ్చల్ ఓఆర్‌ఆర్–దుండిగల్–పటాన్‌చెరు: 30
పటాన్‌చెరు ఓఆర్‌ఆర్–కోకాపేట్–నార్సింగ్ ఓఆర్‌ఆర్: 37.4
బీహెచ్‌ఈఎల్–బాచుపల్లి–కొంపల్లి–దమ్మాయిగూడ: 37.4
మెట్టుగూడ–మల్కాజిగిరి–ఈసీఐఎల్: 8.0
బోయిన్‌పల్లి–బాలానగర్–హైటెక్‌సిటీ: 14
విప్రో సర్కిల్–గోపన్‌పల్లి–బీహెచ్‌ఈఎల్: 11.2
పటాన్‌చెరు–ఇస్నాపూర్ (ఓఆర్‌ఆర్): 6.0
హయత్‌నగర్–పెద్దఅంబర్‌పేట్: 15
ఎంజీబీఎస్– అంబర్‌పేట్–ఘట్కేసర్: 35
అమీర్‌పేట్–బాలానగర్–దుండిగల్: 20
హబ్సిగూడ–నాచారం–ఓఆర్‌ఆర్ ఘట్కేసర్: 17.7
లక్డీకాఫూల్–గచ్చిబౌలి–మియాపూర్: 25
నానల్‌నగర్–లంగర్‌హౌస్–మొయినాబాద్: 21
మలక్‌పేట్ మెట్రో–ఐఎస్‌సదన్–ఒవైసీ హాస్పిటల్: 4.5