
హైదరాబాద్ పోలీసులకు క్రికెట్ స్టేడియం!
● నాలుగు ఎకరాల్లో నిర్మించాలని ప్రతిపాదన
● పోలీసులకు ఉచితంగా, ఇతరులకు అద్దెకు..
అంబర్‌పేట లేదా ఆరాంఘర్ చౌరస్తాలో ఏర్పాటుకు యోచన
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ సిటీ పోలీసులకు సొంతంగా ఓ క్రికెట్ స్టేడియం అందుబాటులోకి రానుంది. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో అన్ని సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకురావాలని పోలీసు శాఖ భావిస్తోంది. అంబర్‌పేటలోగానీ, ఆరాంఘర్ చౌరస్తాలోగానీ నిర్మించే ఈ స్టేడియాన్ని పోలీసు విభాగం అధికారులు, సిబ్బంది ఉచితంగా, సాధారణ పౌరులు అద్దెకు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ స్టేడియం క్రీడావసరాలకు మాత్రమే వినియోగించనున్నారు.
గతంలో స్టేడియం ఉన్నప్పటికీ...
సిటీ పోలీసు విభాగం కొన్ని దశాబ్దాల క్రితం గోషామహల్‌లో శివకుమార్ లాల్ పోలీసు స్టేడియం నిర్మించింది. అయితే ఇందులో అసరమైన వసతులు లేకపోవడంతో పోలీసు శిక్షణలు, డ్రిల్స్‌తోపాటు కొన్ని క్రీడలు, కార్యక్రమాల నిర్వహణకు మాత్రమే వినియోగించేవారు. అయితే అఫ్జల్‌గంజ్‌లో ఉన్న ఉస్మానియా ఆసుపత్రిని ఈ ప్రాంతానికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించి ఆ మేరకు చర్యలు తీసుకుంది. మొత్తం 43 ఎకరాల 37 గంటలు ఉన్న ఈ స్టేడియం స్థలం నుంచి 31 ఎకరాల 39 గుంటలు ఆసుపత్రికి సేకరించి... 11 ఎకరాల 38 గుంటలు పోలీసు అవసరాలకు కేటాయించింది. ఉస్మానియా ఆస్పత్రి కోసం గోషామహల్ స్టేడియం ప్రాంగణం నుంచి స్థలం తీసుకుంటున్నందున, దీనికి ప్రతిగా ఆరాంఘర్ ప్రాంతంలో 12 ఎకరాలను పోలీసు విభాగానికి కేటాయించింది.
పరిశీలనలో ఆ రెండు ప్రాంతాలు...
గోషామహల్ వద్ద పోలీసు విభాగానికి కేటాయించిన స్థలంలో ట్రాక్‌తోపాటు అశ్వాల కోసం స్టేబుల్స్, పోలీసు జాగిలాల కోసం కెన్నల్స్ నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసు క్రికెట్ స్టేడియం నిర్మాణానికి రెండు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. అంబర్‌పేట పోలీసు ట్రైనింగ్ కాలేజీ(పీటీసీ) ప్రాంగణంలో చాలా భాగం ఖాళీగా ఉంది. అయితే అక్కడకు రాకపోకలు సాగించడానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. గోషామహల్ స్టేడియం స్థలానికి ప్రతిగా ఆరాంఘర్ చౌరస్తాలో ప్రభుత్వం కేటాయించిన 12 ఎకరాల స్థలంలో రాష్ట్రస్థాయి బ్యారెక్స్, ప్లేగ్రౌండ్, డ్రిల్ ఏరియా నిర్మించాలని డీజీపీ కార్యాలయం ఇప్పటికే నిర్ణయించింది. దీంతో ఇందులో నుంచి నాలుగు ఎకరాలను క్రికెట్ స్టేడియం కోసం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాంతం విమానాశ్రయం, ఇన్నర్ రింగ్‌రోడ్, ఔటర్ రింగ్‌రోడ్ నుంచి రాకపోకలు సాగించడానికి అనువుగా ఉంటుంది.
వినియోగం.. ఆదాయం..
ఈ క్రికెట్ స్టేడియాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సభలు, సమావేశాలు, కార్యక్రమాలు, శుభకార్యాలకు ఇవ్వరు. క్రికెట్ ఆడటానికి, శిక్షణ ఇవ్వడానికి అనువుగా సకల సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ స్టేడియంలో పోలీసు స్పోర్ట్స్ మీట్స్‌తోపాటు పోలీసు అధికారులు, సిబ్బంది వారాంతాలు, ఇతర సమయాల్లో క్రికెట్, ఇతర క్రీడలు ఆడుకోవడానికి ఉచితంగా అందిస్తారు. ఔత్సాహికులైన యువకులు, క్రీడాకారులు ఈ గ్రౌండ్‌ను అద్దెకు తీసుకోవచ్చు. ఇప్పటికే పెట్రోల్ బంకులు తదితరాల ద్వారా పోలీసు వెల్ఫేర్ ఫండ్‌కు ఆదాయం వస్తున్న నేపథ్యంలో ఈ స్టేడియాన్ని క్రీడావసరాలకు అద్దెకు ఇవ్వడం ద్వారానూ ఆదాయం పొందవచ్చని పోలీసు విభాగం యోచిస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి దీని పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.