
హైడ్రా @ పైగా
సాక్షి, సిటీబ్యూరో: జల వనరులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణతో పాటు ప్రకృతి వైపరీత్యాల సమయంలో సత్వర స్పందన కోసం ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) పైగా ప్యాలెస్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించనుంది. బేగంపేటలోని వారసత్వ కట్టడం పైగా ప్యాలెస్‌ను హైడ్రా హెడ్–క్వార్టర్స్‌గా మార్చాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనికి సంబంధించిన దస్త్రం ఒకట్రెండు రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దకు చేరనున్నట్లు తెలిసింది. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) లోపల ఉన్న 2053.44 చదరపు కిలోమీటర్ల ప్రాంతం హైడ్రా పరిధిలోని రానుండటంతో అందుకు తగ్గట్టు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ప్యాలెస్‌కు సుదీర్ఘ చరిత్ర..
దాదాపు 119 ఏళ్ల క్రితం అయిదెకరాల స్థలంలో సువిశాలంగా, రెండు అంతస్తుల్లో యూరోపియన్ శైలిలో పైగా ప్యాలెస్ నిర్మితమైంది. మీర్ మహబూబ్ అలీఖాన్ వద్ద ప్రధానమంత్రిగా పైగా వంశానికి చెందిన నవాబ్ వికారుల్ ఉమ్రా పని చేశారు. ఆయనే 1900లో ఈ ప్యాలెస్‌ను నిర్మించారు. వారి వంశం పేరుతోనే ఇది పైగా ప్యాలెస్‌గా మారింది. ఈ భవనం నిజాంకు నచ్చడంతో ఉమ్రా ఆయనకు బహుమతిగా ఇచ్చారు. మీర్ మహబూబ్ అలీఖాన్ తన కుటుంబ సమేతంగా అప్పుడప్పుడు ఈ ప్యాలెస్‌కు వచ్చి గడిపేవారు. 2008 అక్టోబరు 24 నుంచి ఈ ప్యాలెస్ అమెరికన్ కాన్సులేట్‌గా మారింది. అమెరికన్ కాన్సులేట్ కోసం నానక్‌రామ్‌గూడలో అత్యాధునిక భవనం నిర్మించడంతో 2023 మార్చి 20 అక్కడకు వెళ్లింది. హెచ్‌ఎండీఏ అధీనంలోని ఈ భవనం అప్పటి నుంచి ఖాళీగానే ఉంది.
ఆ రెండు చోట్లా జోనల్ కార్యాలయాలు..
ముఖ్యమంత్రి ఆమోద ముద్ర పడిన తర్వాత కొన్ని మరమ్మతులు చేయించి పైగా ప్యాలెస్‌ను హైడ్రాకు అప్పగించనున్నారు. నగరం మధ్యలో ఉండటమే కాకుండా సౌలభ్యం, భద్రత ఇతర కోణాల్లోనూ ఈ భవనం ఉత్తమమని ప్రభుత్వం గుర్తించింది. పరిపాలనా పరమైన సౌలభ్యం కోసం హైడ్రాను మూడు జోన్లుగా విభజించనున్నారు. నార్త్ జోన్‌లోకి సైబరాబాద్, సౌత్ జోన్‌లోకి రాచకొండ, సెంట్రల్ జోన్‌లోకి హైదరాబాద్ పోలీసు కమిషనరేట్లలోని ప్రాంతాలు రానున్నాయి. సెంట్రల్ జోన్ కార్యాలయం ప్రస్తుతం హైడ్రా కమిషనర్ కూర్చుంటున్న బుద్ధ భవన్ కేంద్రంగా పని చేయనుంది. సౌత్ జోన్ ఆఫీస్ మేడిపల్లి వైపు, నార్త్ జోన్ ఆఫీస్ కోసం శేరిలింగంపల్లి, మాదాపూర్ వైపు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల వివరాలను ప్రభుత్వం ఆరా తీస్తోంది.
ఒక ఐపీఎస్, ముగ్గురు నాన్–క్యాడర్స్..
హైడ్రా హెడ్ క్వార్టర్స్‌లో ఎస్పీ హోదాలో ఉన్న ఓ ఐపీఎస్ అధికారి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా ఉండనున్నారు. ఆపై ఒక్కో జోన్‌కు నాన్ కేడర్ ఎస్పీ స్థాయి అధికారులు నేతృత్వం వహించనున్నారు. ప్రతి ఎస్పీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌తో పాటు అసెట్ ప్రొటెక్షన్‌ను పర్యవేక్షిస్తారు. మొదటి అంశంలో ట్రాఫిక్ పోలీసులు, రెండో అంశంలో జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి పని చేస్తారు. హైడ్రా పరిధిలోకి జీహెచ్‌ఎంసీతో పాటు ఓఆర్‌ఆర్ లోపల ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, ప్రత్యేక పరిపాలన బాడీలు, ఇండస్ట్రియల్ ఏరియాలు వస్తున్నాయి. వాటికి సంబంధించిన చట్టాల ప్రకారం ఈ అధికారులు పని చేస్తారు. హైడ్రాలో ఏర్పడే మూడు జోన్లలో కలిపి 72 ప్రత్యేక బృందాలు పని చేయనున్నాయి. ఇవన్నీ తమ పరిధిలో విపత్తు స్పందన, ఆక్రమణల నిరోధంతో పాటు అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటాయి.
హెడ్ క్వార్టర్స్‌గా మారనున్న వారసత్వ కట్టడం
కాన్సులేట్ తరలింపు తర్వాత ఖాళీగానే భవనం
సైబరాబాద్, రాచకొండల్లో జోనల్ కార్యాలయాలు
సూత్రప్రాయంగా నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం
హెడ్ క్వార్టర్స్‌లోనే పోలీసుస్టేషన్..
ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై జీహెచ్‌ఎంసీ అధికారులు స్థానిక పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. హైడ్రా పరిధి మొత్తానికి కలిపి ఆ విభాగం పరిధిలో ఓ ఠాణా ఏర్పాటు కానుంది. ఏసీపీ స్థాయి అధికారి నేతృత్వంలో పని చేసే ఈ పోలీసు స్టేషన్‌ను పైగా ప్యాలెస్‌లోనే ఏర్పాటు చేయనున్నారు. జల వనరులతో పాటు ప్రభుత్వ భూముల కబ్జాలకు సంబంధించిన కేసుల నమోదు, దర్యాప్తు జరుగుతుంది. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్)లతో పాటు హైడ్రా ఆర్డినెన్స్/చట్టం ఆధారంగానే ఈ ఠాణా పని చేయనుంది. పోలీసు, జీహెచ్‌ఎంసీ, హైడ్రా అధికారుల ఫిర్యాదు మేరకే కాకుండా కీలకాంశాలపైనా ఈ ఠాణా దృష్టి పెట్టనుంది.