మిస్‌ వరల్డ్‌ పోటీలపై మిల్లా మాగీ సంచలన ఆరోపణలు.. కేటీఆర్‌ డిమాండ్‌ ఇదే.. | KTR Respond On Miss England Milla Magee Allegations | Sakshi
Sakshi News home page

మిస్‌ వరల్డ్‌ పోటీలపై మిల్లా మాగీ సంచలన ఆరోపణలు.. కేటీఆర్‌ డిమాండ్‌ ఇదే..

May 25 2025 11:20 AM | Updated on May 25 2025 1:12 PM

KTR Respond On Miss England Milla Magee Allegations

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం తొలిసారి ఆతిథ్యం ఇస్తున్న మిస్‌ వరల్డ్‌–2025 అందాల పోటీల చుట్టూ తీవ్ర వివాదం ముసురుకుంది!. మిస్‌ ఇంగ్లండ్‌ మిల్లా మాగీ.. మిస్‌ వరల్డ్‌ పోటీలపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. ఆమె చేసిన ఆరోపణలపై సంపూర్ణంగా విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు.

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ.. మిల్లా మాగీ ఒక బలమైన మహిళ, మా తెలంగాణలో మీరు ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నందుకు మేము చింతిస్తున్నాము. తెలంగాణలో మహిళలను గౌరవించే గొప్ప సంస్కృతి ఉంది. ఇక్కడ మహిళలను పూజిస్తాము, గౌరవిస్తాము, వారి అభివృద్ధికి సమాన అవకాశాలను కల్పిస్తాము. రాణి రుద్రమ, చిట్యాల ఐలమ్మ వంటి గొప్ప నాయకులు మా తెలంగాణ మట్టిలో పుట్టినవారే.

దురదృష్టవశాత్తు, మీరు ఎదుర్కొన్న ఈ చేదు అనుభవం నిజమైన తెలంగాణను ప్రతిబింబించేది కాదు. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఏ ఒక్క మహిళ గానీ, ఆడపిల్ల గానీ ఇలాంటి భయానక అనుభవాలను ఎదుర్కోకూడదని ఒక అమ్మాయికి తండ్రిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాధితురాలిని విమర్శించడం, ఆమెను తప్పుగా చూపించడాన్ని ఖండిస్తున్నాను. అలాగే మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలపై సంపూర్ణంగా విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉండగా, అంతకుముందు.. వ్యక్తిగత కారణాలతో పోటీల నుంచి వైదొలగుతున్నట్లు చెప్పి స్వదేశం వెళ్లిపోయిన మిస్‌ ఇంగ్లండ్‌ మిల్లా మాగీ తాజాగా ‘ద సన్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోటీల తీరుపై సంచలన ఆరోపణలు గుప్పించారు. తాను వేశ్యననే భావన కలిగేలా నిర్వాహకులు పరిస్థితులను కల్పించారంటూ బాంబు పేల్చారు. నిర్వాహకులు పేర్కొన్నట్లు ఈ పోటీలు బ్యూటీ విత్‌ పర్పస్‌కు అనుగుణంగా లేవని.. అదంతా డొల్లేనని దుయ్యబట్టారు. పోటీదారులంతా ఎల్లవేళలా మేకప్‌ వేసుకోవాలని ఆదేశించారని.. అల్పాహారం సమయంలోనూ బాల్‌ గౌన్లు ధరించాల్సిందేనని హుకుం జారీ చేశారని విమర్శించారు. ‘పోటీకి ఆర్థిక సహకారం అందిస్తున్న స్పాన్సర్లకు కృతజ్ఞతాపూర్వకంగా ఆరుగురు అతిథులు కూర్చున్న ఒక్కో టేబుల్‌ వద్ద ఇద్దరేసి పోటీదారులను కూర్చోబెట్టారు. సాయంత్రం మొత్తం వారితో కూర్చొని కృతజ్ఞతలు తెలుపుతూ మేం వినోదం అందించాలని నిర్వాహకులు ఆశించారు.

ఓ సమయంలో పోటీల ఉద్దేశం గురించి అతిథులకు వివరించే ప్రయత్నం చేశా. కానీ ఈ విషయాన్ని వారెవరూ పట్టించుకోలేదు. అది నాకు భరించలేనట్లుగా అనిపించింది. ఇతరుల వినోదం కోసం నేను ఇక్కడికి రాలేదు కదా అనుకున్నా. సంపన్న పురుష స్పాన్సర్ల ముందు కవాతు చేశాక వేశ్యలా భావించా’ అని మిల్లా మాగీ చెప్పుకొచ్చింది.

మారాలనుకున్నా... నా వల్ల కాలేదు.. 
సమాజంలో మార్పు తీసుకురావడానికి, యువతలో స్ఫూర్తినింపి వారి భవితకు దోహదపడాలనే ఉద్దేశంతోనే పోటీలో పాల్గొన్నానని మిల్లా మాగీ పేర్కొంది. కానీ అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితుల్లో ఉంటానని ఏమాత్రం ఊహించలేకపోయానని చెప్పుకొచ్చింది. అతిథులను సంతోషపెట్టేందుకు ఆటాడే కోతుల్లా అక్కడ కూర్చోవాల్సి వచ్చిందని.. దీన్ని ఏమాత్రం తట్టుకోలేకపోయానని వాపోయింది.

‘నేను నిర్వాహకుల నిబంధనలకు అనుగుణంగా మారాలనే ప్రయత్నంలో ఒత్తిడిని అనుభవించా. అలా చేయకపోతే గెలవలేననే విషయం నాకు అర్థమైంది. మిస్‌ వరల్డ్‌ పోటీలంటే మనం ఎలా ఉన్నామో అలా కనిపించడం. కానీ 1970ల నుంచి ఆ పోటీల తీరు మారలేదు. అందుకే మేకప్‌ లేకుండానే బయటకు వెళ్లడం ప్రారంభించా. అల్పాహారం తీసుకోవడానికి నాకు నప్పేవి, తగిన దుస్తులను ధరించడం ప్రారంభించా’ అని మిల్లా మాగీ చెప్పింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement