
పుర్రెకో బుద్ధి... జిహ్వకో రుచి అని పాత సామెత. యువతరం.. కొత్త తరం విషయంలో ఇది మరింత సత్యం. అందుకే నగరాల్లో రకరకాల కాఫీలు ప్రత్యక్షమవుతున్నాయి. పాపులర్ అవుతున్నాయి కూడా. తాజాగా ఈ జాబితాలోకి చేరుతోంది ప్రఖ్యాత కంపెనీ టాటాకు చెందిన స్టార్‌బక్స్.
విషయం ఏమిటంటే.. హైదరాబాద్‌లోని కాజాగూడ ప్రాంతంలో స్టార్‌బక్స్ దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి ‘ఎక్స్‌పెరిమెంటల్ స్టోర్’ను ప్రారంభించింది. ప్రపంచం నలుమూలల్లోని వేర్వేరు దేశాల కాఫీ రుచులను హైదరాబాదీలకు పరిచయం చేయడమే కాకుండా.. దేశీ వెరైటీలు కొన్నింటిని అందుబాటులోకి తెచ్చింది. మలబార్ కోకనట్ క్రీమ్ పేరుతో కాఫీలోకి కొబ్బరిపాల మీగడను చేర్చి
అందిస్తుండగా .. మహారాష్ట ఎర్ర జామ పండ్ల ముక్కలకు, తమిళనాట పెరిగే కాంతారి మిరపకాయల రుచులను చేర్చింది. అలాగే తాటిబెల్లంతో తయారైన కాఫీని కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా అందిస్తున్నారు.
‘‘కాఫీ గింజలు ఎక్కడైనా ఒక్కటే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ప్రాంతాన్ని బట్టి అక్కడి కాఫీ గింజల లక్షణాలు మారిపోతాయి. అక్కడి నీరు, మట్టిలోని ఖనిజాలు, వాతావరణాల ప్రభావంతో ఆ గింజలతో తయారైన కాఫీ రుచిలోనూ తేడాలొస్తాయి’’ అని వివరించారు స్టార్‌బక్స్ కాఫీ అంబాసిడర్ విభోర్ మిశ్రా. దీంతోపాటు డికాక‌్షన్ తయారు చేసే పద్ధతిని బట్టి కూడా రుచి మారుతూంటుందని తెలిపారు. కాఫీ గింజలు/పొడికి వేడి నీటిని కలిపి కాగితపు న్యాప్‌కిన్ ద్వారా ఫిల్టర్ చేస్తే కాఫీలోని నూనెలు తగ్గుతాయని, సాధారణ ఫిల్ట్రేషన్‌తో ఇలా జరగదని కూడా ఆయన వివరించారు.
కాఫీతోపాటు స్టార్‌బక్స్ ఎక్స్‌పెరిమెంటల్ స్టోర్‌లో రెడ్‌వెల్వెట్, చాకొలెట్ ట్విస్ట్, ఇటాలియన్ వంటకం ‘క్రాసో’ వంటివి కూడా అందిస్తున్నారు. అప్పుడప్పుడు తాము కాఫీ తయారీకి సంబంధించిన వర్క్‌షాపులు కూడా నిర్వహిస్తూంటామని విభోర్ తెలిపారు. ‘‘కాఫీ అనగానే మన మనసుల్లో ఎన్నో జ్ఞాపకాలు మెదలుతాయి. నాకైతే స్టార్‌బక్స్ ఎక్స్‌పెరిమెంటల్ స్టోర్‌లో లభిస్తున్న దేశీ కాఫీ వెరైటీలకు, క్రాసో, చాకొలెట్ ట్విస్ట్, రెడ్‌వెల్వెట్ లకు మంచి లింకు కుదిరినట్లు అనిపిస్తుంది’’ అని వివరించారు పేస్ట్రీ షెఫ్, చాకొలటీర్ నికిత ఉమేశ్! ఇంకో విషయంలో ప్రపంచంలోని సుమారు 40 వేల ఔట్‌లెట్లలో మాదిరిగానే ఇక్కడ కూడా లాటే, డార్క్ రోస్ట్, బ్లాండ్ రోస్ట్ వంటివి ఇక్కడ కూడా లభిస్తాయి.!