కొత్త పంథా.. అదే దందా! | Sakshi
Sakshi News home page

కొత్త పంథా.. అదే దందా!

Published Tue, Nov 21 2023 4:42 AM

- - Sakshi

హైదరాబాద్: కబ్జారాయుళ్లు కొత్త పంథా ఎంచుకున్నారు. ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న గదుల వద్ద ట్రాన్స్‌జెండర్లను ముందు పెట్టి.. వెనక కబ్జాల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. గాజుల రామారం డివిజన్‌ కై సర్‌ నగర్‌లోని ప్రధాన రహదారిని ఆనుకొని హనుమాన్‌ దేవాలయానికి ఎదురుగా ఉన్న సర్వే నంబర్‌ 342/1 ప్రభుత్వ స్థలంలో ఓ కుల సంఘం పేరిట వారం రోజులుగా 200కు పైగా గదులు నిర్మించారు. ఈ నిర్మాణాల వెనక సదరు కుల సంఘం పెద్దగా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి తన తతంగాన్ని కొనసాగిస్తున్నాడు.

ఈ విషయమై సోమవారం ‘ఇదే తరుణం.. కబ్జా చేద్దాం’ అని శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీంతో మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ గౌతమ్‌ స్పందించారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని. కబ్జాకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు రజనీకాంత్‌, రేణుకలు తమ సిబ్బందితో అక్కడికి చేరుకొని రెండు గదులను కూల్చివేశారు. దీంతో కబ్జా వెనకాల ఉన్న ఓ కుల పెద్ద ట్రాన్స్‌జెండర్లను రంగంలోకి దింపాడు. కూల్చివేతలను అడ్డుకొని నానా హంగామా చేసి రెవెన్యూ అధికారులను పరుగులెత్తించారు. చేసేదేమీ లేక వెనుదిరగాల్చి వచ్చింది.

సదరు వ్యక్తిపై విచారణ..
సర్వే నంబర్‌ 342/1 ప్రభుత్వ స్థలంలో కుల సంఘం పేరుతో గదులను నిర్మిస్తూ రూ.కోట్లు ఆర్జిస్తున్న వ్యక్తిపై సంబంధిత అధికారులు రహస్యంగా విచారణ చేపట్టారు. సదరు వ్యక్తి గతంలో చాలాచోట్ల కుల సంఘం పేరిట ప్రభుత్వ స్థలాన్ని ప్లాట్లుగా చేసి, ఒక్కో ప్లాటును నలుగురికి అమ్మి ఎంతో మందిని మోసం చేసినట్లు బహిరంగంగా ఆరోపిస్తున్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement