
రోడ్ షోలు,
బహిరంగ సభలు
అత్యధికంగా నాంపల్లి నుంచి 34 మంది
కంటోన్మెంట్ నుంచి అత్యల్పంగా 10 మంది..
నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఇదీ పరిస్థితి
ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టాల్లో నామినేషన్లు.. ఉపసంహరణలు ముగిశాయి. ఇప్పటి వరకు అభ్యర్థుల ఖరారు.. టికెట్లు దక్కని వారి అలకలు.. బుజ్జగింపులు.. అనర్హతలు.. రెబెల్స్.. ఉపసంహరణలు తదితరమైనవి ముగిసిపోయాయి. దీంతో అన్ని పార్టీలూ ప్రచారంపై దృష్టి సారించాయి. బరిలో మిగిలిన ఆయా పార్టీల అభ్యర్థులెవరో లెక్క తేలింది. తమకు ప్రత్యర్థులెవరో వెల్లడైంది. దీంతో వారికంటే మిన్నగా ఉండేందుకు, విపక్ష పార్టీలను ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు ముమ్మర ప్రచారానికి సిద్ధమయ్యాయి.
–సాక్షి, సిటీబ్యూరో
హైదరాబాద్ జిల్లా బరిలో 312 మంది అభ్యర్థులు
ప్రజాక్షేత్రంలోకి అభ్యర్థులు
కొత్త పుంతలు తొక్కేలా..
గ్రేటర్ పరిధిలోకొచ్చే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లో ఈ ప్రచారాలు మరింత కొత్తపుంతలు తొక్కేలా ఆయా పార్టీల అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఉదయాన్నే పార్కుల్లో వాకర్స్ నుంచి మొదలు పెడితే రాత్రి వరకు వివిధ మార్గాల్లో ప్రజలను కలిసేందుకు అన్నిపార్టీలూ మొగ్గు చూపుతున్నాయి. ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఉదయం, సాయంత్రం రెండు పూటలా పాదయాత్రలతో ప్రజల ఇళ్ల ముంగిటికే వెళ్లి ఓట్లు వేయాల్సిందిగా అభ్యర్థించడం ఇప్పటికే మొదలైంది. మధ్యాహ్నం కాసేపు విరామంలో అనుయాయులు, కార్యకర్తలతో వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నారు. సూపర్ మార్కెట్లు, చాయ్ కేఫేలు వంటివాటినీ వదలకుండా ఎవరి పద్ధతిలో వారు ప్రచారాలు నిర్వహిస్తున్నారు.
సోషల్ మీడియాకు ప్రాధాన్యం
పోస్టర్లు, వాల్‌రైటింగ్స్, బ్యానర్ల వంటివి ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా ప్రచారానికి అందరూ ప్రాధాన్యతనిస్తున్నారు. తమ పార్టీని, అభ్యర్థిని గెలిపించాలని కోరడంతో పాటు ఎదుటి పార్టీకి ఓటేస్తే జరిగే నష్టాన్ని వ్యంగ్య చిత్రాలు, టెక్నాలజీ వినియోగంతో వినూత్నంగా వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్ (ట్విట్టర్) ఫేస్ బుక్‌లలోనూ పోస్ట్ చేస్తున్నారు. ప్రత్యేకంగా యూట్యూబ్ చానెల్స్ క్రియేట్ చేయించుకుంటున్న వారూ ఉన్నారు. పంచ్ డైలాగుల వంటి నినాదాల కోసం కంటెంట్ రైటర్లను ప్రత్యేకంగా నియమించుకుంటున్న వారూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
టీవీ, ఎఫ్‌ఎం రేడియోల్లో పార్టీల తరపున ప్రచారం ముమ్మరం కానుంది. ఇప్పటికే అభ్యర్థుల పేర్లతో పాటలు హోరెత్తుతుండగా ఇవి మరింత తీవ్రం కానున్నాయి. ఎటు చూసినా, ఎప్పుడైనా అంతటా తామే కనిపించేలా విస్తృత ప్రచారాలకు సిద్ధమయ్యారు. నియోజకవర్గంలోని ఓట ర్ల ఫోన్ నెంబర్లు సేకరించి నియోజకవర్గంలోని ఫలానా అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా ఇప్పటికే సెల్‌ఫోన్లు మార్మోగుతున్నాయి. ఎస్‌ఎంఎస్‌లూ తీవ్రం కానున్నాయి. గతంలో ఎంతో కాలం అధికారంలో ఉన్న వాళ్లు ఏమీ చేయలేదని చెప్పడంతోపాటు తమ హయాంలో జరిగిన అభివృద్ధిని బీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారం చేస్తుండగా, అమలు కాని అధికార పార్టీ హామీలు, నిరుద్యోగం వంటివాటిని ప్రతిపక్ష పార్టీలు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నాయి.
సమయం సద్వినియోగానికి..
ప్రచారానికి రెండు వారాల సమయం కూడా లేకపోవడంతో, ఉన్న సమయంలోనే తమ నియోజకవర్గంలోని గల్లీగల్లీని చుట్టుముట్టేలా, వివిధ వేదికల ద్వారా, పలు మాధ్యమాల ద్వారా ప్రజలమనస్సుల్లో బలంగా నాటుకుపోయేలా విస్తృతంగా ప్రచారాలకు అన్ని పార్టీలూ సిద్ధమయ్యాయి.
ప్రముఖ నేతల పర్యటనలు
వీటితోపాటు అన్ని పార్టీల్లోని కీలకనేతలు, ప్రముఖులు, రోడ్‌షోలు, బహిరంగ సభల ద్వారా ప్రచారం చేయనున్నారు. బీఆర్‌ఎస్ నుంచి మంత్రి కేటీఆర్ రోజుకు రెండుమూడు నియోజకవర్గాల్లో రోడ్‌షోల నిర్వహణకు షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. ఈ నెల 25వ తేదీన బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. బీజేపీ తరపున ప్రచారానికి కేంద్రమంత్రి అమిత్‌షా వస్తున్నారు. ఈనెల 18వ తేదీన రాజేంద్రనగర్‌లో జరిగే బహిరంగసభలో ఆయన పాల్గొననున్నారు.నెలాఖరులో ప్రధాని మోదీ వచ్చే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసం ఆ పార్టీ జాతీయ నేతలు రాహుల్‌గాంధీ తదితరులు నగరానికి రానున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఇలా వివిధ మార్గాల్లో , వివిధ మాధ్యమాల్లో , వివిధ ప్రాంతాల్లో దాదాపు రెండు వారాల పాటు ప్రచారం మోతెక్కి పోనుంది.


