సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఐడీ రూపొందించిన నూతన విధానాన్ని అమలు చేస్తున్నట్లు సీపీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. నూతన విధానంలో బాధితుడు ఆసుపత్రిలో ఉన్నా అక్కడికే వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్టు తెలిపారు. ప్రతీ కేసును డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారులు పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.
హైదరాబాద్ సీపీ సజ్జనార్ తాజాగా మాట్లాడుతూ..‘తెలంగాణ పోలీసుల చారిత్రాత్మక నిర్ణయం, ఘటనా స్థలంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం. బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోలీసులే బాధితుల ఇంటి వద్దకు వెళ్తారు. హైదరాబాద్‌లో పకడ్బందీగా అమలులోకి విక్టిమ్ సిటిజన్ సెంట్రిక్ విధానం. బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా నూతన విధానం ఉంటుంది. ఆత్మహత్యలు, అసహజ మరణాలు, రోడ్డు ప్రమాదాలు, చోరీలు, దోపిడీలు, వాహన దొంగతనాలు, మహిళలు, పిల్లలపై నేరాలు, ర్యాగింగ్ కేసులకు వర్తింపు ఉంటుంది. సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నేరుగా ఫిర్యాదు స్వీకరిస్తారు.
నూతన విధానంలో బాధితుడు ఆసుపత్రిలో ఉన్నా అక్కడికే వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. బాధితుల గౌరవం, గోప్యతకు భంగం కలగకుండా సేవలు ఉంటాయి. విధానం అమలులో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాధితులను అకారణంగా స్టేషన్‌కు పిలిస్తే సంబంధిత అధికారులదే బాధ్యత. ప్రతీ కేసును డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారు. ఫిర్యాదు లేదా ఎఫ్ఐఆర్ నమోదు జరగకపోతే హైదరాబాద్ పోలీస్ వాట్సాప్ నంబర్ 94906 16555కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సైబర్ నేరాలకు ఇప్పటికే ప్రారంభమైన సీ-మిత్రతో పాటు ఈ విధానం ప్రజలకు మరింత మేలు చేస్తుంది’ అని చెప్పుకొచ్చారు.


