అందరికీ మెరుగైన వైద్య సేవలందాలి | Sakshi
Sakshi News home page

అందరికీ మెరుగైన వైద్య సేవలందాలి

Published Thu, Nov 16 2023 6:27 AM

‘లివ్‌ ఫర్‌ ఎ లెగసీ’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న వెంకయ్యనాయుడు తదితరులు - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: కేన్సర్‌ వంటి మహమ్మారి రోగాలకు ఉత్తమమైన చికిత్సను అందించడంతో పాటు ఈ రోగాలపైన అవగాహన కల్పించడానికి డాక్టర్లు వారాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. డాక్టర్లు చెప్పే మాటలను ప్రజలు విశ్వసిస్తారని, సామాజిక మార్పులో డాక్టర్లు–యాక్టర్లది కీలక పాత్రని ఆయన చెప్పారు. నగరంలోని హోటల్‌ దస్పల్లా వేదికగా ప్రముఖ రోబోటిక్‌ కేన్సర్‌ సర్జన్‌ డాక్టర్‌ చినబాబు సుంకవల్లి రచించిన ‘లివ్‌ ఫర్‌ ఎ లెగసీ’ పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ కేన్సర్‌ ప్రాణాంతక వ్యాధి కాదని, ముందుగానే గుర్తిస్తే నివారించవచ్చన్నారు. వయసులో తనకన్నా పెద్దదైన సహోదరి రొమ్ము కేన్సర్‌ బారిన పడిందని, సరైన సమయంలో చికిత్స తీసుకున్నందున కేన్సర్‌ను జయించిందని గుర్తు చేసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అన్ని వర్గాల వారికి అందాలనేది డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం ఆశయమని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. కార్పొరేట్‌ వైద్యం కూడా అందరికీ అనువైన ధరల్లో లభించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా కార్పొరేట్‌ ఆస్పత్రుల బ్రాంచ్‌లు ప్రారంభించాలన్నారు. ఈతరం యువత రోజువారీ వ్యాయామం, యోగాపైన, సమతుల ఆహారం తీసుకోవడంపైన దృష్టి సారించాలన్నారు. ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఇప్పటికీ తాను సిబ్బందితో కలిసి బ్యాడ్మింటన్‌ ఆడతానని పేర్కొన్నారు. డాక్టర్‌ చినబాబు వంటి ఇతర వైద్యులు కూడా తమ అనుభవాలతో మంచి పుస్తకాలను రచించాలని సూచించారు. దేశంలో కేన్సర్‌ను జయించడానికి, సమూలంగా నిర్మూలించడానికి మనమందరం సమష్టిగా కృషి చేయాల్సిన అవసరముందని డాక్టర్‌ చినబాబు తెలిపారు. ఈ పుస్తకం వంద సంవత్సరాలకు పైగా కేన్సర్‌ పరిణామం వెనుకున్న విజ్ఞాన శాస్త్రాన్ని అందిస్తుందన్నారు. సహ రచయిత ప్రొఫెసర్‌ అరుణ్‌ తివారీ మాట్లాడుతూ.. డాక్టర్‌ అబ్దుల్‌ కలాం ప్రతి సంవత్సరం ఒక పుస్తకం రాయాలని తనకు సలహా ఇచ్చారని, అది నేనెప్పుడూ చేస్తానని అనుకోలేదని, ఇప్పుడది నిజమైతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యశోద హాస్పటల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జి.సురేందర్‌ రావు, యశోద హాస్పిటల్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పవన్‌ గోరుకంటి, టీఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌, తెలంగాణ మాజీ డీజీపీ మహేందర్‌ రెడ్డి, పద్మ శ్రీ సునితా క్రిష్ణన్‌, పలువురు వైద్య రంగ నిపుణులు పాల్గొన్నారు.

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Advertisement
 
Advertisement