
నల్లకుంట: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న ఫార్మసిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ గవర్నమెంట్ ఫార్మసిస్ట్స్ అసోసియేషన్ (టీజీపీఏ) హెల్త్ డైరెక్టర్‌ను కోరింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం హెల్త్ డైరెక్టర్(డీహెచ్) డాక్టర్ జి.శ్రీనివాస్‌ను కలిసిన టీజీపీఏ ప్రతినిధి బృందం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేసింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు బత్తుల సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ.. తాము అందజేసిన వినతి పత్రానికి స్పందించిన డీహెచ్ సెక్షన్ అధికారుల నుంచి ఫైల్ తెప్పించి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తున్న ఫార్మసిస్టులకు గ్రేడ్ వన్ పోస్టుల ప్రమోషన్‌లు ఇచ్చే విషయమై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. అలాగే 38 జిల్లాల్లో ఖాళీగా ఉన్న గెజిటెడ్ ఫార్మసీ సూర్‌వైజర్ల పోస్టుల భర్తీ చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారని చెప్పారు. రాష్ట్రంలో 750 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటి భర్తీకై ఫైనాన్స్ విభాగం ఆమోదం కూడా ఉందని, వెంటనే ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్ జారీ చేయాలని ఈ సందర్భంగా డీహెచ్‌ను కోరామని చెప్పారు. డీహెచ్‌ను కలిసిన వారిలో టీజీపీఏ రాష్ట్ర కార్యదర్శి జె. సురేష్, అసోసియేటివ్ అధ్యక్షుడు జాలిగామ అశోఖ్, గౌరవాధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, కోశాధికారి యాదయ్య, ఉపాధ్యక్షులు చిలువేరి ఉదయ్ ప్రసాద్, ఎంఎల్ నాయక్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు సత్యం కౌటం, ప్రధాన కార్యదర్శి నార్ల వేణు మాధవ్, ఎస్.సూరయ్య, ప్రియదర్శిని, సరిత, సంధ్య తదితరులున్నారు.