రైల్వేస్టేషన్‌లో బాలుడి కిడ్నాప్‌ | - | Sakshi
Sakshi News home page

రైల్వేస్టేషన్‌లో బాలుడి కిడ్నాప్‌

Oct 1 2023 4:12 AM | Updated on Oct 1 2023 7:51 AM

- - Sakshi

సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో బాలుడి కిడ్నాప్‌ వ్యవహారం రైల్వేపోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. భిక్షాటన చేస్తున్న ఓ జంట బాలుడిని కిడ్నాప్‌ చేసినట్లు గుర్తించిన రైల్వే పోలీసులు శనివారం మధ్యాహ్నం నిందితులను అరెస్ట్‌ చేశారు. తీవ్ర అస్వస్తతకు గురైన బాలుడిని కిడ్నాపర్ల బారి నుంచి సంరక్షించి చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. మెదక్‌ జిల్లా, కౌడిపల్లి మండలం, రాయలపురం గ్రామానికి చెందిన ఎం.దుర్గ్గేశ్‌ బధిరుడైన తన కుమారుడు శివసాయి(5)తో తిరుమల దర్శనం కోసం వెళ్లి శుక్రవారం తిరిగి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. సాయంత్రం 5గంటల ప్రాంతంలో 1వ నెంబర్‌ ప్లాట్‌ఫామ్‌ వద్ద కుమారుడు శివసాయిని తన లగేజీ బ్యాగ్‌ వద్ద కూర్చోబెట్టి వాష్‌రూంకు వెళ్లివచ్చేసరికి శివసాయి కనిపించలేదు. ప్లాట్‌ఫామ్‌పై గాలించినా ఆచూకీ తెలియకపోవడంతో అతను జీఆర్‌పీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా.....
దుర్గేశ్‌ ఫిర్యాదుతో అప్రమత్తమైన జీఆర్‌పీ పోలీసులు సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా గుర్తు తెలియని జంట శివసాయిని కిడ్నాప్‌ చేసినట్లు గుర్తించారు. రైల్వేస్టేషన్‌ పరిసరాల్లో వాకబు చేయగా వారు ఇరువురు బెగ్గింగ్‌ మాఫియాలో సహాయకులుగా పనిచేస్తున్న విక్రం, రెహానాగా గుర్తించారు. శివసాయితోపాటు కిడ్నాపర్లు వెంట తీసుకెళ్లిన బ్యాగ్‌లో దుర్గేశ్‌ సెల్‌ఫోన్‌ ఉండటంతో సెల్‌ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా నిందితుల కదలికలను గుర్తించిన పోలీసులు వారు బాలుడిని మాదాపూర్‌ ప్రాంతానికి తీసుకెళ్లినట్లు గుర్తించారు. విక్రం బ్యాగులోని సెల్‌ఫోన్‌ను విక్రయించేందుకు యత్నించగా అది చోరీ చేసిన సెల్‌ఫోన్‌గా భావించిన ఆటో డ్రైవర్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని మాదాపూర్‌ పోలీసులకు అందించాడు. మాదాపూర్‌ పోలీసుల సహకారంతో జీఆర్‌పీ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

చిన్నారుల అపహరణే లక్ష్యంగా....
మహారాష్ట్రకు చెందిన విక్రం భార్యాపిల్లలతో నగరాని కి వచ్చి బషీర్‌బాగ్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్నా డు. హోటల్‌ వర్కర్‌గా పని చేయడంతోపాటు నేరాలకు పాల్పడేవాడు. అతడికి రెహానా అనే యాచకురాలితో పరిచయం ఏర్పడటంతో సహజీవనం చేస్తున్నా రు. వీరు మాదాపూర్‌ ప్రాంతంలో నివాసం ఉంటూ బెగ్గింగ్‌ మాఫియాకు కిడ్నాప్‌ చేసిన పిల్లలను అందిస్తూ డబ్బు సంపాదిస్తున్నట్లు పోలీసు విచారణ వెల్లడైంది. మాదాపూర్‌ వంతెన సమీపంలో తీవ్ర అస్వస్తతకు గురైన శివసాయిని గుర్తించిన పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు నిందితులను వేర్వేరు ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు.

కొనసాగుతున్న దర్యాపు...
నిందితులను అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు మరిన్ని వివరాలు రాబట్టేందుకు విచారణ చేపట్టారు. బాలుడి కిడ్నాప్‌ వెనుక ఉన్న మాఫియా గుట్టును రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. బాలుడు ప్లాట్‌ఫామ్‌ మీద ఒంటరిగా ఉన్నందున కిడ్నాప్‌ చేశారా లేక మూగ చెవిటి బాలుడిగా గుర్తించిన అనంతరం రెక్కీ నిర్వహించి కిడ్నాప్‌ చేశారా అన్న కోణంలో దర్యాపు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఒంటరిగా ఉన్న బాలుడు ఆకలితో ఏడుస్తున్నందున తాము వెంట తీసుకెళ్లామని, ఉద్దేశపూర్వకంగా కిడ్నాప్‌ చేయలేదని నిందితులు బుకాయిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement