దుర్గం చెరువు ఎస్టీపీ సిద్ధం

- - Sakshi

హైదరాబాద్: దేశంలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా అవతరించేందుకు జలమండలి అడుగులు వేస్తోంది. మహానగర పరిధిలో రోజూ ఉత్పన్నమయ్యే మురుగు నీటిని శుద్ధి చేసేందుకు 31 కొత్త మురుగు నీటిశుద్ధి కేంద్రా(ఎస్టీపీ)ల నిర్మాణ పనులు చేపడుతోంది. ఇప్పటికే 15 ఎంఎల్‌డీల సామర్థ్యంతో నిర్మించిన కోకాపేట ఎస్టీపీ ప్రారంభం కాగా.. సుమారు 7 ఎంఎల్‌డీల సామర్థ్యంతో నిర్మించిన దుర్గం చెరువు మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని సోమవారం మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. ఆరు నెలలుగా దీని ట్రయల్‌ రన్‌ కొనసాగుతోంది.

ఎస్‌బీఆర్‌ సాంకేతికతతో..
అధునాతన సీక్వెన్సింగ్‌ బ్యాచ్‌ రియాక్టర్‌ టెక్నాలజీతో దుర్గం చెరువు ఎస్టీపీల నిర్మాణం చేపట్టారు. ఎస్‌బీఆర్‌ టెక్నాలజీ ఎస్టీపీని నిర్మించడంతో ఒకే చాంబర్లో అయిదు స్టేజీల మురుగునీటి శుద్ధి ప్రక్రియ ఉంటుంది. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ నీటిని శుద్ధి జరుగుతుంది. దేశంలో వినియోగిస్తున్న వివిధ బయోలాజికల్‌ ట్రీట్‌మెంట్‌ పద్ధతుల కంటే మెరుగ్గా మురుగు నీటి శుద్ధి జరుగుతుంది.

మూడు ప్యాకేజీల్లో..
మహానగరంలో మొత్తం 3 ప్యాకేజీల్లో 5 సర్కిళ్లలో సుమారు రూ.3866.41 కోట్ల వ్యయంతో 1259.50 ఎంఎల్‌డీ సామర్థ్యం గల 31 మురుగు నీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ) నిర్మిస్తున్నారు. అధునాతన సీక్వెన్సింగ్‌ బ్యాచ్‌ రియాక్టర్‌ టెక్నాలజీతో కొత్త ఎస్టీపీల నిర్మాణం జరుగుతోంది.

ప్యాకేజీ–1 లో అల్వాల్‌, మల్కాజిగిరి, కాప్రా, ఉప్పల్‌ సర్కిల్‌ ప్రాంతాల్లో రూ.1230.21 కోట్లతో 8 ఎస్టీపీలను ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా 402.50 ఎంఎల్‌డీల మురుగు నీటిని శుద్ధి చేస్తారు.

ప్యాకేజీ–2 లో రాజేంద్రనగర్‌, ఎల్బీ నగర్‌ సర్కిల్‌ ప్రాతాల్లో రూ.1355.13 కోట్లతో 6 ఎస్టీపీలను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ 480.50 ఎంఎల్‌డీ మురుగు నీటిని శుద్ధి చేస్తారు.

ప్యాకేజీ–3లో కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లి సర్కిల్‌ ప్రాంతాల్లో రూ.1280.87 కోట్ల వ్యయంతో 17 ఎస్టీపీలను ఏర్పాటు చేసి, ఇక్కడ 376.50 ఎంఎల్‌డీల మురుగు నీటిని శుద్ధి చేయనున్నారు.

రోజువారీగా 1950 ఎంఎల్‌డీల మురుగునీరు..
హైదరాబాద్‌ అర్బన్‌ పరిధిలో ప్రస్తుతం రోజూ 1950 ఎంఎల్‌డీల మురుగు నీరు ఉత్పన్నమవుతోంది. జీహెచ్‌ఎంసీ ప్రాంతంలో 1650 ఎంఎల్‌డీలు ఉండగా, ఇప్పటికే 25 ఎస్టీపీల ద్వారా 772 ఎంఎల్‌డీల మురుగు నీటిని (46 శాతం) శుద్ధి చేస్తున్నారు. ఇది దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే అధికం. మిగిలిన 878 ఎంఎల్‌డీల మురుగు నీటిని శుభ్రం చేయడానికి ఎస్టీపీల నిర్మాణాలను చేపట్టారు. 2036 సంవత్సరం వరకు ఉత్పన్నమయ్యే మురుగును వీటి ద్వారా శుద్ధి చేయవచ్చు.

వాసన కట్టడికి చర్యలు
నివాసాల సమీపంలో నిర్మిస్తున్న ఎస్టీపీల నుంచి దుర్వాసన రాకుండా జలమండలి ప్రత్యేక చర్యలు చేపడుతోంది. దీనికోసం ఆధునిక విదేశీ సాంకేతికతను అధికారులు ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా.. విశాలమైన ఎస్టీపీల ప్రాంగణాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కోసం గార్డెనింగ్‌, ల్యాండ్‌ స్కేపింగ్‌ పనులు చేపడుతున్నారు. వీటితో పాటు మొత్తం 22 ఎస్టీపీల ప్రాంగణాల్లో సుగంధ ద్రవ్యాల జాతికి చెందిన ఆకాశమల్లి, మిల్లింగ్‌, టోనియా, మైకేలియా చంపాకా, (సింహాచలం సంపంగి) మొక్కల్ని నాటారు. ఇవి దుర్వాసనను అరికట్టి సువాసనను వెదజల్లుతాయి.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top