నిలోఫర్‌లో బాలుడి అపహరణ | - | Sakshi
Sakshi News home page

నిలోఫర్‌లో బాలుడి అపహరణ

Sep 16 2023 7:18 AM | Updated on Sep 16 2023 7:28 AM

- - Sakshi

నాంపల్లి: నవజాత శిశు సంరక్షణ కేంద్రమైన నిలోఫర్‌ ఆస్పత్రిలో ఆరు నెలల బాలుడు అపహరణకు గురయ్యాడు. ఈ ఘటన నాంపల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గండిపేట ప్రాంతానికి చెందిన ఫరీదాబేగం, సల్మాన్‌ ఖాన్‌ దంపతులకు ఇద్దరు కుమారులు. నాలుగేళ్ల కుమారుడు ఫర్హత్‌ ఖాన్‌ కొన్ని రోజులుగా విష జ్వరంతో బాధపడుతున్నాడు. వైద్యం నిమిత్తం ఫర్హత్‌ ఖాన్‌ను గురువారం ఉదయం రెడ్‌హిల్స్‌లోని నిలోఫర్‌ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అదే రోజు రాజీవ్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ బ్లాక్‌లోని డీఎస్‌ఆర్‌ వార్డులో చేర్చారు. ఫర్హత్‌ ఖాన్‌ కోలుకోవడంతో ప్రస్తుతం యూనిట్‌–4లో చికిత్స పొందుతున్నాడు.

కాగా.. ఆరు నెలల రెండో కుమారుడు ఫైజల్‌ ఖాన్‌ను తమ వెంట ఆస్పత్రికి తీసుకువచ్చారు. వార్డులో చికిత్స పొందుతున్న పెద్ద కుమారుడు ఫర్హత్‌ ఖాన్‌ దగ్గర తండ్రి సల్మాన్‌ ఖాన్‌ ఉండగా, చిన్న కుమారుడు ఫైజల్‌ ఖాన్‌ తల్లి ఫరీదా బేగం ఇద్దరూ వార్డు బయట ఉన్నారు. ఈ క్రమంలో ఫరీదా బేగానికి ఓ గుర్తు తెలియని మహిళ పరిచయమైంది. ఇద్దరూ వరండాలో కూర్చుని ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇదే సమయంలో ఫైజల్‌ ఖాన్‌ నిద్రపోయాడు. కుమారుడు నిద్రపోతుండటంతో తనకు పరిచయమైన గుర్తు తెలియని మహిళకు బాబును చూస్తూ ఉండమని చెప్పి భోజనం కోసం కిందకు వెళ్లింది.

భోజనం తీసుకుని కింద నుంచి మొదటి అంతస్తులోనికి తిరిగి వచ్చే లోపు గుర్తు తెలియని మహిళ బాలుడు ఫైజల్‌ ఖాన్‌ కనిపించకుండా పోయారు. బాలుడి కోసం ఎంత వెతికినా జాడ కానరాకపోవడంతో తల్లిదండ్రులు నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. కిడ్నాప్‌నకు గురైన బాలుడి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. గడచిన 24 గంటలుగా అన్ని కోణాల్లో విస్తృతంగా పరిశీలన చేస్తున్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, ఇప్పటికే అయిదు బృందాలను ఏర్పాటు చేశామని నాంపల్లి ఇన్‌స్పెక్టర్‌ అభిలాష్‌ పేర్కొన్నారు.

అనుమానాలెన్నో..
రోగి సహాయకురాలిగా నిలోఫర్‌ ఆస్పత్రి రాజీవ్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ బ్లాక్‌లోకి ఆగంతుకురాలు ప్రవేశించి.. ఓ మహిళను తన మాయ మాటలతో బుట్టలో వేసుకుని ఆమె ఆరు నెలల కుమారుడిని అపహరించిన ఘటన నగరంలో కలకలం రేపింది. ఆగంతుకురాలి తాలూకు బంధువులెవరైనా ఆస్పత్రిలో ఉన్నారా? లేక బాలుడిని ఎత్తుకెళ్లడానికే రోగి సహాయకురాలి అవతారంలో వచ్చిందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. పిల్లలు లేని వారు వచ్చి రెక్కీ నిర్వహించారా? ఎవరైనా డబ్బులు ఇస్తే వచ్చి తీసుకెళ్లారా? అనే కోణాలూ కనిపిస్తున్నాయి.

కొత్తవారు ఆస్పత్రికి వచ్చి పిల్లల్ని ఎత్తుకెళ్లడం అంత సులభమేమీ కాదని పలువురు నిలోఫర్‌ వైద్యులు చెబుతున్నారు. బాలుడి అపహరణ వెనక ఆస్పత్రికి చెందిన ఇంటి దొంగల ప్రమేయమేమైనా ఉందా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఘటన జరిగి 24 గంటలైనా బాలుడి ఆచూకీ లభించలేదు. పోలీసులకు సైతం చిన్నపాటి క్లూ కూడా దొరకకుండా దొంగలు జాగ్రత్త పడటం గమనార్హం. ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రవేశ మార్గంలో మినహా ఎక్కడా సీసీ కెమెరాలు పని చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే కిడ్నాపర్‌కు కలిసి వచ్చిందని అర్థమవుతోంది. విజిటింగ్‌ అవర్స్‌లో బాలుడిని కిడ్నాప్‌ చేసి ఉంటారని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఉషారాణి అనుమానం వ్యక్తంచేశారు.

నవజాత శిశువు వదిలివేత

నిలోఫర్‌ ఆస్పత్రిలో అయిదు రోజుల మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. ఐసీయూ భవనంలోని మొదటి అంతస్తులో నేల మీద ఉన్న శిశువు ఏడుస్తూ కనిపించడంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చి శిశు విహార్‌కు తరలించారు. నిలోఫర్‌లో లభ్యమైన శిశువుకు ఎలాంటి ట్యాగ్‌ లేదని, గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణలో పూర్తి వివరాలు తెలుస్తాయని, నిలోఫర్‌లోనే కాన్పు జరిగిందా? లేక బయట నుంచి వచ్చిన వ్యక్తులు వదలివెళ్లారా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ అభిలాష్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement