
చిన్నారులను అప్పగిస్తున్న డీసీపీ చందనా దీప్తి, ఏసీపీ రమేష్
రాంగోపాల్‌పేట్: వేర్వేరు ప్రాంతాల్లో బాలికను, బాలుడిని అపహరించిన ఇద్దరు నిందితుల్ని మహంకాళి పోలీసులు అరెస్టు చేశారు. రెండు గంటల్లోనే కిడ్నాప్ కేసును ఛేదించి చిన్నారులను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఆదివారం ఉత్తర మండలం డీసీపీ చందనా దీప్తి మహంకాళి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ ప్రాంతంలో మేఘరాజ్ కాలే అనే వ్యక్తి, ఆయన భార్య వివిధ రకాల వస్తువులు విక్రయిస్తూ ఫుట్‌పాత్‌పై జీవనం సాగిస్తున్నారు. వీరికి ఏడుగురు సంతానం. అయిదుగురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. ప్యారడైజ్ ఎదురుగా ఉండే దాదూస్ స్వీట్స్ ఎదురుగా ఫుట్‌పాత్‌పై శనివారం రాత్రి నిద్రించారు.
● ఆదివారం తెల్లవారు జామున 3.40 గంటల సమయంలో ఆటోలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు మూడున్నరేళ్ల మేఘరాజ్ కుమార్తె కరిష్మాను అపహరించుకుని వెళ్లారు. ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ వ్యక్తి దీన్ని గమనించి కరిష్మా కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. నిందితులు ఆటోలో ఎంజీరో డ్డు మీదుగా వెళ్లి పోయారు. తెల్లవారు జామున 4.15 నిమిషాలకు కరిష్మా తండ్రి కాలే మహంకాళి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే ఉత్తర మండలో డీసీపీ చందనా దీప్తి మహంకాళి, మార్కెట్ పోలీసులను అలర్ట్ చేశారు.
సుల్తాన్ బజార్‌లో ఏడు నెలల బాలుడిని..
ప్యారడైజ్ ప్రాంతంలో బాలికను అపహరించిన నిందితులు నేరుగా అబిడ్స్ వైపు వెళ్లారు. సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో హనుమాన్ టెక్డీ ప్రాంతంలో ఫుట్‌పాత్‌పై నివసిస్తూ అబిడ్స్‌లోని గ్రాండ్ హోటల్‌లో స్వీపర్లుగా పనిచేసే దంపతుల కుమారుడైన శివకుమార్‌ను అపహరించారు.
రెండు గంటల్లోనే ఛేదించారు..
బాధితుల నుంచి ఫిర్యాదు అందగానే ఉత్తర మండలం డీసీపీ చందనా దీప్తి ఆదేశాల మేరకు మహంకాళి ఏసీపీ రమేష్, ఇన్‌స్పెక్టర్ కావేటి శ్రీనివాస్, ఎస్సై శ్రీకాంత్, మార్కెట్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు తదితరులతో పాటు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. ఆటో ప్రయాణించిన మార్గంలో ఉండే సీసీ ఫుటేజ్‌లను పరిశీలించి రెండు గంటల్లోనే ఫలక్‌నుమాలోని ప్రధాన నిందితుడు ఇంటి వద్ద ఉండగా పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు చిన్నారులను డీసీపీ చందనా దీప్తి తల్లిదండ్రులకు అప్పగించారు. రెండు గంటల్లోనే కేసును ఛేదించి ఇద్దరు చిన్నారులను రక్షించిన పోలీసులను అభినందించారు.
అప్పటికప్పుడే పథకం
ఫలక్‌నుమాకు చెందిన షేక్ ఇమ్రాన్ ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నిజామాబాద్ జిల్లా నాగారం దొడ్డి కొమురయ్య కాలనీకి చెందిన సలీం భార్య పర్వీన్ గృహిణి. రెండు రోజుల క్రితం ఇంట్లో భర్తతో గొడవపడి నగరానికి వచ్చింది. శనివారం రాత్రి పర్వీన్ కోఠి బస్టాండ్ ప్రాంతంలో ఉండగా షేక్ ఇమ్రాన్‌తో పరిచయమైంది. వీరిద్దరు కలిసి పిల్లలను కిడ్నాప్ చేయాలని పథకం వేశారు. కలిసి మద్యం తాగారు. ఆదివారం తెల్లవారు జామున ప్యారడైజ్, హనుమాన్ టెక్డీ ప్రాంతాల్లో ఇద్దరు పిల్లలను కిడ్నాప్ చేశారు.
అపహరణకు కారణమేంటి?
నిందితులు పిల్లలను ఎందుకు కిడ్నాప్ చేశారనేది మిస్టరీ వీడలేదు. పిల్లలను విక్రయిస్తే రూ.2 లక్షలు వస్తాయనే కిడ్నాప్ చేసినట్లు పోలీసుల విచారణలో పర్వీన్ చెప్పింది. తాను నిజామాబాద్ నుంచి తన కుమారుడితో కలిసి వచ్చానని సికింద్రాబాద్ స్టేషన్‌లో తన కుమారుడిని ఎవరో తీసుకుని వెళ్లారని అందుకే కిడ్నాప్ చేశానంటూ ఆమె మరోసారి పొంతన లేని సమాధానం చెప్పింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం కేసులో షేక్ ఇమ్రాన్ నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పూర్తి స్థాయిలో విచారణ చేస్తే కిడ్నాప్ కోణం బయటకు వస్తుందని భావిస్తున్నారు.