
కవాడిగూడ/ఖైరతాబాద్/బంజారాహిల్స్: తెలంగాణ పోలీసులకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం ఉదయం ట్యాంక్‌బండ్‌పై సురక్షా దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, డీజీపీ అంజనీకుమార్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, దానం నాగేందర్, సినీనటుడు నిఖిల్, నగర కొత్వాల్ సీవీ ఆనంద్ పాల్గొన్నారు. రంగురంగుల బెలూన్లను ఎగురవేశారు. జెండా ఊపి వాహన ర్యాలీని ప్రారంభించారు.
ఆకట్టుకున్న ఎక్స్‌పో
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టాచ్యూ సమీపంలో తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టిన పోలీస్ ఎక్స్‌పో ఆకట్టుకుంది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన ఎక్స్‌పోలో పోలీసు, ఇంటెలిజెన్స్, ట్రాఫిక్, ఫైర్, షీ టీం, సైబర్ క్రైం, బాంబ్, డాగ్ స్క్వాడ్, జైలు శాఖతో పాటు పోలీసు శాఖలో వివిధ విభాగాల్లో ఉపయోగించే వెపన్స్‌ను ప్రదర్శించారు. ఆయా స్టాళ్లలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించేందుకు నగరవాసులు ఎంతో ఆసక్తి చూపారు. బ్రాస్ బ్యాండ్, సైలెంట్ డ్రిల్, పైప్ బ్యాండ్, డాగ్ షోలతో పాటు పోలీసులు ఆపద సమయంలో తమను తాము ఎలా రక్షించుకోవాలి, దాడి చేసేందుకు వచ్చిన వారిని ఎలా ఎదుర్కోవాలనే విషయాలను ప్రదర్శించారు.
అనంతరం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, సినీనటుడు నాని, క్రీడాకారిణి నైనా జైస్వాల్, డీజీపీ అంజనీకుమార్, పోలీస్ కమిషనర్లు సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, డీఎస్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. బంజారాహిల్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ వద్ద సురక్షా దినోత్సవాలు ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు.
దాదాపు వేయి మంది పోలీసులతో ఐసీసీసీ నుంచి బంజారాహిల్స్ మీదుగా కె.వి.ఆర్ చెక్‌పోస్ట్ వరకు తిరిగి ఐసీసీసీ వరకు ఫుట్ పాట్రోలింగ్ బై నైట్ పేరుతో ర్యాలీ నిర్వహించారు. సినీనటుడు అడివి శేషు, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ పాల్గొన్నారు. కాగా.. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎల్బీనగర్, చార్మినార్ తదితర ప్రాంతాల్లో సురక్షా దినోత్సవాన్ని ఘనంగా చేపట్టారు. మాదాపూర్ దుర్గం చెరువు వద్ద ఆకాశంలో డ్రోన్ లేజర్ షో అద్భుతంగా నిర్వహించారు.
దుర్గం చెరువు వద్ద లేజర్ షోను వీక్షిస్తున్న ప్రజలు