
ఉదయం నుంచే భగభగలు
సాక్షి, సిటీబ్యూరో: సూరీడు సుర్రుమంటున్నాడు. గురువారం నిప్పులు కక్కాడు. ఉదయం నుంచే భగభగలతో భగ్గుమన్నాడు. నడినెత్తిపై ఠారెత్తించే ఎండతో పాటు వడ గాలులు నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. రోడ్డుపై వాహనదారులు, చిరువ్యాపారులు తల్లడిపోయారు. ఇళ్లలో వేడి, ఉక్కపోత ఆందోళన కలిగించాయి. గత నెల 25న ప్రారంభమైన రోహిణికార్తె ఈ నెల 8న ముగియనున్న తరుణంలో ఎండలు మరింత దంచి కొడుతున్నాయి. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే గరిష్టంగా రెండు మూడు డిగ్రీలు అధికంగా పెరిగింది. గురువారం నగరంలోని ఖైరతాబాద్ గణాంక భవన్ వద్ద అత్యధికంగా 41.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అడ్డగుట్ట, తిరుమలగిరిలో 41.4, బీహెచ్‌ఈఎల్ 41.2, షేక్‌పేట 41.0, గచ్చిబౌలి, వెస్ట్ మారేడుపల్లి 40.8, గౌతమ్ నగర్, సర్దార్ మహల్ 40.7, గోల్కొండ, కూకట్‌పల్లి, జీడిమెట్లలో 40.6, న్యూ నాగోల్, అల్కాపురి, బాలాజీనగర్‌లో 40.5 డిగ్రీలు నమోదయ్యాయి. మరో మూడు రోజుల వరకు ఎండల తీవ్రత ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.