
యజమాని చెంతకు చేరిన జర్మన్‌షెపర్డ్‌తో పోలీసులు, గాంధీ జీడీఎక్స్ సెక్యూరిటీ సిబ్బంది
గాంధీ ఆస్పత్రి: తప్పిపోయి గాంధీఆస్పత్రికి చేరిన జర్మన్‌షెపర్డ్ శునకం ఎట్టకేలకు వారం రోజుల తర్వాత గురువారం యజమాని చెంతకు చేరింది. చిలకలగూడ రైల్వేక్వార్టర్స్‌లో నివసిస్తున్న మిల్టన్‌బాబ్ రైల్వే రిటైర్డ్ ఉద్యోగి. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ జింఖానా మైదానంలో అండర్–19 క్రికెట్ కోచ్‌గా పని చేస్తున్నారు. అయిదు జర్మన్‌షెపర్డ్ జాతి శునకాలను పెంచుకుంటున్నారు. వీటిలో తప్పిపోయిన కుక్క పేరు బ్యారీ. వారం రోజుల క్రితం ఇంటి వరండాలో ఆడుకుంటున్న బ్యారీ హఠాత్తుగా అదృశ్యమైంది. పలు ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకుండాపోయింది. గాంధీఆస్పత్రికి చేరిన జర్మన్ షెపర్డ్ శునకాన్ని జీడీఎక్స్ చీఫ్ ఆఫీసర్ శివాజీ నేతృత్వంలో సెక్యూరిటీ సిబ్బంది చేరదీశారు. యజమానిపై బెంగతో నీరసించిపోయిన విషయాన్ని ‘నువ్వు వస్తావని’ శీర్షికన‘సాక్షి’ కథనం ప్రచురించింది. వృత్తిరీత్యా డ్రైవర్ అయిన కిషోర్, తప్పిపోయిన కుక్క యజమాని మిల్టన్‌బాబ్‌కు స్నేహితుడు. గురువారం ఆలుగడ్డబావిలోని ఓ బార్బర్ షాపులో ‘సాక్షి’లోప్రచురితమైన కథనం చూసి స్నేహితునికి సమాచారం అందించి గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు. యజమానిని చూసిన వెంటనే శునకం లేచి ఆయన చుట్టూ తిరుగుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.
