
సంచలనాత్మక నేరాలకు కొన్ని చిత్రాలే స్ఫూర్తి
వాటినీ స్ఫూర్తిగా తీసుకుంటున్నారు
కేవలం సినిమాలనే కాదు వెబ్ సిరీస్‌లు, మీడియాలో వస్తున్న కథనాలను కూడా స్ఫూర్తిగా తీసుకుని నేరాలు చేసిన ఉదంతాలు ఉన్నాయి. ఇలాంటివి చేసి, తను అలా ఊహించుకోవడం ఓ మానసిక రుగ్మత కిందికే వస్తుంది. కొందరు నిందితులు అంతకు ముందు ఎలాంటి నేర చరిత్ర లేకపోయినా ‘సినిమా’ స్ఫూర్తితో నేరం చేసి, మీడియాను పరిశీలిస్తూ పక్కాగా తప్పించుకోగలుగుతున్నారు. వీరి ఎత్తుల నేపథ్యంలో దర్యాప్తులు జటిలంగా మారిపోతున్నాయి. ఇది బాధితులకు నష్టం కలిగించే అంశం. ఈ తరహా ఉదంతాల నేపథ్యంలో అటు సినిమాలు, ఇటు మీడియాలో మార్పు రావాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.
– బి.రామకృష్ణ, రిటైర్డ్ డీఎస్పీ
సాక్షి, సిటీబ్యూరో: నేరగాళ్లు సినిమాలను చూసి నేర్చుకుంటున్నారు.. వాటిలోని అంశాలను పథకాలుగా మార్చుకుని అమలు చేస్తున్నారు.. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకూ మీడియాను ‘వాడుకుంటున్నారు’. జూబ్లీహిల్స్‌లో గర్భిణిని నిర్బంధించి రూ.10 లక్షలు దోచుకుపోయిన రాజేష్ యాదవ్‌కు ఓటీటీలో క్రైమ్ వెబ్ సిరీస్‌లు, మార్కెట్ పరిధిలో బంగారం కార్ఖానాను కొల్లగొట్టిన అంతర్రాష్ట్ర బందిపోట్లకు ‘స్పెషల్ 26’, ‘గ్యాంగ్’ చిత్రాలు, టీఎస్‌పీఎస్సీ పరీక్షల్లో హైటెక్ మాల్ ప్రాక్టీసింగ్ చేసిన పూల రమేష్‌కు ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ చిత్రం ప్రేరణగా మారాయి. కేవలం వీరికే కాదు... షాహినాయత్‌గంజ్ ఠాణా పరిధిలో టెన్త్‌క్లాస్ విద్యార్థి అభయ్ మోదాని కిడ్నాప్, హత్య చేసిన ద్వయంతో పాటు ఉగ్రవాది వికారుద్దీన్, ఆర్‌ఏకే లాడ్జ్‌లో ఎన్‌ఆర్‌ఐ కుటుంబాన్ని హత్య చేసిన దుండుగులు సైతం ఇదే తరహాలో ‘సినిమా చూపించారు’.
ఆంఖే చూసి దోపిడీలు: నగరానికి చెందిన ఉగ్రవాది వికారుద్దీన్ తెహరీక్ గల్బా ఏ ఇస్లాం (టీజీఐ) పేరుతో సంస్థను ఏర్పాటు చేసి తెగబడ్డాడు. తన సహచరుడితో కలిసి 2002లో అమితాబ్ కథానాయకుడిగా నటించిన ‘ఆంఖే’ చిత్రాన్ని చూసిన వికార్.. అందులో చూపించిన విధంగా దోపిడీలు చేయాలని నిర్ణయించుకుని ఈ–సేవ కేంద్రాలను టార్గెట్‌గా చేసుకున్నాడు. మలక్‌పేట, సంతోష్‌నగర్, చిక్కడపల్లిలోని ఈ–సేవ కేంద్రంలో దోపిడీలు చేశాడు. ఇలా వచ్చి సొమ్ములో కొంత జల్సాలకు ఖర్చు చేయగా... చాలా భాగం జిహాదీ కార్యకలాపాల విస్తరణకు వాడేశాడు.
‘వీడొక్కడే’ చూసి కారం వినియోగం: సికింద్రాబాద్‌లోని ఆర్‌ఏకే రాయల్ లాడ్జిలో ఎన్నారై వరప్రసాద్, ఆయన భార్య విజయలక్ష్మితో పాటు వారి పిల్లలు కేతన్, కవిత దారుణంగా హతమయ్యారు. వీరిని చంపిన దుండగులు ఘటనాస్థలిలో ఎలాంటి ఆధారాలు దొరక్కుండా పక్కా చర్యలు తీసుకున్నారు. డాగ్‌స్క్వాడ్‌కీ చిక్కకుండా ఉండేందుకు మృతదేహాలతో పాటు ఘటనా స్థలిలో కారం పొడి చల్లారు. ఈ కేసులో పట్టుబడిన నిందితుల్లో ఒకడైన జాన్ అబ్రహం అప్పట్లో చూసిన ‘వీడొక్కడే’ సినిమాను స్ఫూర్తిగా కారం వినియోగించాడు. ఆ చిత్రంలో స్మగ్లింగ్ చేసే ప్రతినాయకుడు పోలీసులకు డ్రగ్స్ ఆనవాళ్లు చిక్కకుండా కారం పొడి చల్లుతాడు.
బాలీవుడ్ స్ఫూర్తితో ‘తాజ్’లో: నగరంలోని తాజ్ డెక్కన్ హోటల్‌లో గతంలో వజ్రాల వాచీలు చోరీకి గురయ్యాయి. ఈ పని చేసిన మహారాష్ట్ర వాసులు మదన్‌లాల్ శర్మ, ముఖేష్‌లు ఓ బాలీవుడ్ సినిమా స్ఫూర్తితోనే చేసినట్లు బయటపడింది. ఆ సినిమాలో చూపిన విధంగా వజ్రాలు, నగల వ్యాపారుల నుంచి సొత్తు కాజేశారు. 2009 మార్చి 17న తాజ్ హోటల్‌లో రూ.54 లక్షల విలువైన వాచీలు, మరుసటి రోజు బెంగళూరులోని జ్యువెలరీ షాపు నుంచి రూ.20 లక్షల నగలు, అదే ఏడాది ఏప్రిల్ 11న ముంబైలోని జ్యువెలరీ షాపు నుంచి రూ.80 లక్షలు విలువ చేసే నగలు స్వాహా చేశారు. ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు పట్టుబడిన ఈ ద్వయం ‘సినిమా’ విషయం చెప్పింది.
అభయ్ నిందితుల ‘రెండు సినిమాలు’: అభయ్‌ను కిడ్నాప్ చేసి హత్య చేసిన సాయి తదితరులు ‘ఓ రొమాంటిక్ క్రైమ్ కథ’ సినిమాను స్ఫూర్తిగా తీసుకున్నారు. అందులో చూపిన విధంగానే అభయ్‌ను బంధించే క్రమంలోనే హత్య జరిగిపోయింది. బాలుడితో ‘నిన్ను కిడ్నాప్ చేస్తున్నాం’ అని చెప్పడమూ ఓ సినిమాలో ఉందని పోలీసులు గుర్తించారు. ‘జై చిరంజీవ’ చిత్రంలో ‘తెలుగు కోసం’ అంటూ ఓ హాస్య నటుడిని కిడ్నాప్ చేసే కథానాయకుడు, సహాయకుడు బాధితుడిని ఓ నిర్మానుష్య ప్రాంతంలోని ఇంటికి తీసుకువెళ్తారు. అక్కడకు వెళ్లిన తర్వాత అతడికి కిడ్నాప్ చేస్తున్నట్లు చెప్పి, తాళ్లతో బంధిస్తారు. ఈ త్రయం వ్యవహారమూ అలానే సాగిందని అప్పట్లో తేల్చారు.
స్పెషల్ 26, గ్యాంగ్ చూసి ‘మార్కెట్ దోపిడీ’
ఓటీటీలో క్రైమ్ సిరీస్ చూసి జూబ్లీహిల్స్ నేరం
‘మున్నా భాయ్’ ప్రేరణతో మాస్ కాపీయింగ్
మార్పు రావాల్సిన అవసరం ఉందన్న పోలీసులు
