
హైదరాబాద్: హయత్‌నగర్‌లో కలకలం రేపిన రాజేశ్ (24) మృతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. తొలుత హత్యగా భావించిన పోలీసులు రాజేశ్‌ది ఆత్మహత్యేనని నిర్ధారణకు వచ్చారు. రాజేశ్‌తో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయురాలిది కూడా ఆత్మహత్యేనని, ఇద్దరు కలిసే చనిపోదామని నిర్ణయించుకున్నారని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ప్రేమించి, తనతో కలిసి జీవితాన్ని పంచుకోలేనని తెలిసి, జీర్ణించుకోలేక రాజేశ్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. పెళ్లి కాలేదని తనని మోసం చేసిందని భావించిన రాజేశ్, ప్రేమించిన వ్యక్తి దూరం పెట్టడంతో తట్టుకోలేని టీచర్ బలవర్మరణాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. అబ్దుల్లాపూర్‌మెట్ కుంట్లూరులోని డాక్టర్స్ కాలనీ సమీపంలో ఈ నెల 29న కుళ్లిపోయిన స్థితిలో రాజేశ్ మృతదేహం లభించిన సంగతి తెలిసిందే.
అసలేం జరిగిందంటే..
హయత్‌నగర్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆరు నెలల క్రితం మిస్డ్ కాల్ ద్వారా పరిచయమైన ఉపాధ్యాయురాలు వాట్సాప్ డీపీ ఫొటో చూసిన రాజేశ్ ఆమెతో ప్రేమలో పడ్డాడు. మరోవైపు రాజేశ్ చురుకుదనానికి ఆమె సైతం ఇందుకు సరేనంది. వీరిద్దరు కలిసి హైదరాబాద్, నల్లగొండలోని పలు ప్రాంతాల్లో తిరిగారు. టీచర్‌ను పెళ్లి చేసుకుందామని భావించిన రాజేశ్‌కు.. అప్పటికే ఆమెకు వివాహమైందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారన్న విషయం కొంత కాలం తర్వాత తెలియడంతో రాజేశ్ ఆమెను దూరం పెట్టాడు. తట్టుకోలేకపోయిన టీచర్.. మాట్లాడుకుందామని రమ్మని చెప్పడంతో వీరిరువురూ కలుసుకున్నారు.
చివరిసారిగా పిల్లలను చూసి వస్తానని..
కలిసి జీవించలేమని భావించిన రాజేశ్, టీచర్ విషం తాగి చనిపోదామని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మే 24న హయత్‌నగర్‌లోని ఓ ఫర్టిలైజర్ దుకాణంలో పురుగుల మందు కొనుగోలు చేశారు. ఇద్దరం కలిసే చనిపోదామని శివారు ప్రాంతానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆఖరిసారిగా పిల్లలను చూసి వస్తానని రాజేశ్‌తో చెప్పి, టీచరు హయత్‌నగర్‌లోని తన ఇంటికి వెళ్లిపోయింది. పిల్లలతో కాసేపు గడిపి.. వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమెను నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు మృతి చెందింది.
► తిరిగివస్తానని ఇంటికి వెళ్లిన టీచర్ ఎంతకీ రాకపోవటంతో రాజేశ్ ఆమె వాట్సాప్‌నకు సందేశాలు, ఫోన్లు చేశాడు. ఆమె సెల్‌ఫోన్‌ను గమనించిన మృతురాలి కూతురు ఈ విషయాన్ని తన తమ్ముడికి చెప్పింది. దీంతో టీచర్ కుమారుడు.. రాజేశ్ ఉన్న ప్రాంతానికి వెళ్లి మందలించాడు. తాను ప్రేమించిన టీచర్ మృతి చెందిందన్న విషయం తెలుసుకున్న రాజేశ్.. వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు తాగిన తర్వాత శరీరం మంటలెక్కిన క్రమంలోనే రాజేశ్ తన ఒంటి మీద ఉన్న దుస్తులు విప్పి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.