అమ్మవారికి వాహన సేవలు | - | Sakshi
Sakshi News home page

అమ్మవారికి వాహన సేవలు

Oct 13 2026 1:17 AM | Updated on Oct 13 2026 1:17 AM

అమ్మవారికి వాహన సేవలు వేయిస్తంభాల ఆలయంలో మహాచండీహోమం చెస్‌ చాంపియన్‌షిప్‌లో ‘అక్షత్‌’ ప్రతిభ బాల్‌బ్యాడ్మింటన్‌లో అఖిరానంద్‌ సత్తా

హన్మకొండ కల్చరల్‌: శ్రీభద్రకాళి దేవీ శరన్నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం అన్నపూర్ణాలంకరణలో అమ్మవారిని అలంకరించారు. ఆలయ అర్చకుడు భద్రకాళిశేషు ఆధ్వర్యంలో వేద పండితులు చండీహోమం నిర్వహించారు. అమ్మవారి స్నపనమూర్తికి ఉదయం బ్రహ్మచారిణీ క్రమంలో పూజలు నిర్వహించి ఉత్సవమూర్తిని మకరవాహనంపై, సాయంత్రం దేవజాక్రమంలో పూజలు జరిపి చంద్రప్రభ వాహనంపై ఊరేగించారు. మహిళలు సామూహిక కుంకుమార్చనలు జరుపుకున్నారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పూజలు నిర్వహించుకున్నారు.

హన్మకొండ కల్చరల్‌: వేయిస్తంభాల ఆలయంలో శ్రీరుద్రేశ్వరీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం మహా చండీహోమం నిర్వహించారు. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం నుంచి ప్రభాతసేవ, శ్రీరుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం, గణపతిపూజ, శ్రీరుద్రేశ్వరీ ఉత్సవమూర్తిని అన్నపూర్ణాదేవిగా అలంకరించి బ్రహ్మచారిణి క్రమంలో దుర్గార్చన చేశారు. యాగశాలలో దశమహావిద్య యాగం, సుదర్శనహోమం, అరుణ రుద్రహోమం, మహాచండీహోమం నిర్వహించారు. సాయంత్రం చిన్నారుల కూచిపూడి నృత్యాలు అలరించాయి. ఉత్సవ సమితి అధ్యక్షుడు బత్తిని శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు రమేశ్‌ సేవలందించారు.

విద్యారణ్యపురి: మలేసియాలోని కౌలాలాంపూర్‌ మీడ్‌ వ్యాలీలో ఈనెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరిగిన కామన్‌వెల్త్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో హనుమకొండకు చెందిన లావుడ్య అక్షత్‌ చౌహాన్‌ పలు విభాగాల్లో ప్రతిభ చాటి మెడల్స్‌ సాధించాడు. ర్యాపిడ్‌, బ్లిట్స్‌ విభాగాల్లో గోల్డ్‌ మెడల్స్‌, క్లాసిక్‌ విభాగంలో సిల్వర్‌ మెడల్‌ సాధించాడు. మొత్తం 13 దేశాలకు చెందిన చెస్‌ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.

వరంగల్‌ స్పోర్ట్స్‌: ఈనెల 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఛత్తీస్‌ఘడ్‌లోని బిలాస్‌పూర్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి సబ్‌జూనియర్స్‌ బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో తెలంగాణ జట్టు నుంచి ప్రాతినిథ్యం వహించిన అఖిరానంద్‌ ప్రతిభ కనబర్చాడు. హనుమకొండలోని నయీంనగర్‌కు చెందిన అఖిరానంద్‌ డబుల్స్‌ విభాగంలో తృతీయ స్థానం, జట్టు విభాగంలో ఐదో స్థానంలో నిలవడానికి కీలక భూమిక పోషించినట్లు బాల్‌బ్యాడ్మింటన్‌ సంఘం హనుమకొండ జిల్లా కార్యదర్శి రడం శ్రీనివాస్‌ తెలిపారు. ఈమేరకు సోమవారం గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ ఎండీ అజీజ్‌ఖాన్‌ కలిశారు. జాతీయస్థాయిలో రాణించిన అఖిరానంద్‌ను అభినందిస్తూ శాలువాతో సత్కరించారు. అఖిరానంద్‌ వెంట పీఈటీ తిరుపతిరెడ్డి, అతని తండ్రి రవికుమార్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement