డీఎల్ఎస్ఏ కార్యదర్శి కె.పూజ
వరంగల్ లీగల్: ఈ నెల 21న నిర్వహించే ప్రత్యేక లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కందుకూరి పూజ తెలిపారు. సోమవారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కోర్టు, నర్సంపేట కోర్టుల్లో లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈప్రత్యేక లోక్ అదాలత్లో చెక్ బౌన్స్, ప్రీ–లిటిగేషన్తో పాటు ఇతర రాజీపడదగిన కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించుకోవచ్చని సూచించారు. ఈ ప్రత్యేక లోక్ అదాలత్కు సంబంధించి అక్టోబర్ 12 నుంచి నవంబర్ 20 వరకు ప్రీ–లోక్ అదాలత్ ప్రక్రియ కొనసాగుతుందని, వరంగల్లో రెండు, నర్సంపేటలో ఒకటి చొప్పున మొత్తం మూడు బెంచ్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. చెక్ మొత్తంపై రాజీకి శ్రీరామ్ చిట్స్ ఫైనానన్స్ 30 శాతం, చోలమండలం ఫైనాన్స్ 50 శాతం డిస్కౌంట్ ప్రకటించినట్లు వెల్లడించారు. కక్షిదారులు తమ కేసుల వివరాలను సంబంధిత కోర్టుల్లో తెలియజేసి, న్యాయవాదులతో కలిసి హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లోక్ అదాలత్లో అధిక కేసుల పరిష్కారానికి న్యాయమూర్తులు, పోలీసు అధికారులు, న్యాయవాదులు, బ్యాంకులు, చిట్ఫండ్ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కక్షిదారులు, న్యాయవాదులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


