గ్రేటర్ గ్రీవెన్స్‌లో అర్జీదారుల మొర
వరంగల్ అర్బన్: కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీటి సమస్యలు పరిష్కరించాలని, అక్రమ నిర్మాణాలు తొలగించాలని పౌరులు అర్జీలు అందించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో అడిషనల్ కమిషనర్ జోనా, ఎస్ఈ రాజ్‌కుమార్, సిటీప్లానర్ రవీందర్ రాడేకర్ నగరవాసుల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 73 వినతులు రాగా, అందులో టౌన్‌ప్లానింగ్ విభాగానికి 35, ఇంజనీరింగ్‌కు 22, ఆరోగ్యం, పారిశుద్ధ్యం 6, రెవెన్యూ 6, నీటి సరఫరా 4 అర్జీలు అందాయి. డీఎఫ్ఓ శంకర్లింగం, సీహెచ్ఓ లక్ష్మారెడ్డి, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, సెక్రటరీ అనిల్‌బాబు ఉన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని..
● మడికొండ ఎస్సీ కాలనీ కమ్యూనిటీ హాల్ పక్కన రోడ్డు కబ్జా చేశారని, చర్యలు తీసుకోవాలని స్థానికులు ఫిర్యాదు చేశారు.
● 55వ డివిజన్ గోపాలపూర్లోని నక్షత్ర కాలనీలో సీసీ రోడ్డు, డ్రెయినేజీ సమస్యలు పరిష్కరించాలని, మారుతీ నగర్లో సీసీ రోడ్డు నిర్మించాలని అభివృద్ధి కమిటీ ప్రతినిధులు వేర్వేరుగా వినతులు అందించారు.
● పలివేల్పుల భగత్‌సింగ్‌నగర్‌లో ఓ వ్యక్తి రోడ్డు కు అడ్డంగా కంచె, మొరం పోసి బెదిరిస్తున్నారని కాలనీవాసులు ఫిర్యాదు చేశారు.
● 55వ డివిజన్ సాయినగర్ కాలనీకి తాగునీటి పైప్‌లైన్ నిర్మించాలని, మడికొండ సాయినగర్ కాలనీలో నీటి సమస్య పరిష్కరించాలని వేర్వేరుగా దరఖాస్తులు అందించారు.
● వరంగల్ బెస్తం చెరువు సత్యసాయి నగర్ కాలనీలో తాగునీటి సదుపాయం కల్పించాలని కాలనీవాసులు విన్నవించారు.
● 20వ డివిజన్ కాశిబుగ్గ కొండా లక్ష్మణ్ బాపూజీ మార్గ్‌లో డ్రెయినేజీ నిర్మించాలని కోరారు.
● 43వ డివిజన్ లక్ష్మీపురంలోని 200 గుడిసెవాసులకు ఇళ్ల నంబర్లు కేటాయించి, మౌలిక వసతులు కల్పించాలని సీపీఐ వరంగల్ జిల్లా కార్యదర్శి షేక్ బాష్మియా ఫిర్యాదు అందించారు.


