ధర్మసాగర్ : మేలైన వంగడాలను సాగు చేసి రైతులు అధిక దిగుబడులు సాధించాలని వరంగల్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు డాక్టర్ బైరి రాజు, రమ్యశ్రీ సూచించారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా వరంగల్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు బైరి రాజు, రమ్యశ్రీ మండలంలోని ముప్పారం గ్రామాన్ని బుధవారం సందర్శించారు. భూసారం దెబ్బతినకుండా ఉండేందుకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. రైతులు అధిక మోతాదులో ఎరువులు వినియోగిస్తే జరిగే నష్టాన్ని, అనర్థాలను వివరించారు. రైతులు ఎరువుల వినియోగాన్ని తగ్గించుకొని పెట్టుబడి తగ్గించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కుమార స్వామి, ఏఈఓ హరీశ్, రైతులు పాల్గొన్నారు.


