కాజీపేట: కాజీపేట పట్టణంలోని బాపూజీనగర్ శ్రీవెంకటలక్ష్మి కూరగాయల మార్కెట్‌లో ప్రహరీ నిర్మాణ పనులు అర్ధంతరంగా ఆగిపోవడంతో వ్యాపారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏడున్నర సంవత్సరాల క్రితం మార్కెట్ చుట్టూ ప్రహరీ నిర్మించి విజయనగర్ కాలనీవైపు గేట్ పెట్టకుండా వదిలేయడమే సమస్యాత్మకంగా మారిందని వ్యాపారులు వాపోతున్నారు. గేట్ ఏర్పాటు చేయాలని కోరుతూ కూరగాయల వ్యాపారులు అనేకమార్లు సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందించినా ఫలితం లేకుండా పోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక నాయకుల చొరవ ఫలితంగా మార్కెట్‌లో చిరువ్యాపారులకు కనీస సౌకర్యాలు కల్పిస్తూ పలు అభివృద్ధి పనులు పూర్తయ్యాయి.
అసలు సమస్య ఇక్కడే..
మార్కెట్‌కు వెనుక భాగం ప్రహరీ నిర్మాణాన్ని పూర్తి చేసిన అధికారులు.. గేట్ పెట్టడానికి చేసిన ప్రయత్నాలను కొంతమంది స్థానికులు అడ్డుకున్నారు. ఇది వ్యాపారులు, సమీప కాలనీవాసులకు మధ్య వివాదంగా మారడమేగాక సమస్య తీవ్రమై చిలికిచిలికి గాలివానగా మారింది. పుష్కర కాలం కింద ప్రభుత్వ స్థలంలో ప్రారంభమైన కూరగాయల మార్కెట్ చుట్టూ ప్రహరీ ఉన్నా విజయనగర్‌కాలనీ వైపు గేట్ లేకపోవడంతో పశువులు, పందులు, వాహనాలు మార్కెట్‌లో యథేచ్ఛగా సంచరిస్తూ వ్యాపారులు, కొనుగోలుదారులకు ప్రాణసంకటంగా మారిందని పలువురు వాపోతున్నారు. ఆరునూరైనా సరే కాలనీ వైపు గేట్ పెట్టాల్సిందేనని వ్యాపారులు, తమకు ఇబ్బందులు ఎదురవుతాయంటూ కాలనీవాసులు భీష్మించుకుని కూర్చోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మార్కెట్‌కు మంచి రోజులు వచ్చాయని భావిస్తున్న తరుణంలో గేట్ పెట్టనీయకపోవడం ఎంత వరకు సమంజసమని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. మార్కెట్‌కు ఒకవైపు గేట్ లేకపోవడం వల్ల రాత్రి వేళల్లో ఆకతాయిలు ప్రవేశించి మద్యం సేవించడం, దొంగలు కూరగాయలను ఎత్తుకెళ్తున్నారని చిరువ్యాపారులు వాపోతున్నారు. మార్కెట్ చుట్టూ ప్రహరీ నిర్మాణం పూర్తైనందునా అధికారులు ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా వెంటనే గేట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు.
కాజీపేట వెంకటలక్ష్మి కూరగాయల మార్కెట్‌లోకి పశువులు, పందులు,
కుక్కల సంచారం
రాత్రివేళల్లో అసాంఘిక కలాపాలు
ఇబ్బందులు ఎదుర్కొంటున్న
వ్యాపారులు, వినియోగదారులు


