కాజీపేట అర్బన్: పంట వ్యర్థాలను కాల్చకుండా పొలంలో గుంతలు తీసి వ్యర్థాలను అందులో వేసి ఎరువు తయారు చేసుకోవాలని వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎన్.కిశోర్ సూచించారు. వ్యవసాయ కళా శాల, కాజీపేట మండల వ్యవసాయ శాఖ సౌజన్యంతో కాజీపేట మండలం వ్యవసాయాధికారి సంతోష్ ఆధ్వర్యంలో కాజీపేట మండలం కుమ్మరిగూడెం గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన రైతు ముంగిట శాస్త్రవేత్తలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వానాకాలం సాగులో మెరుగైన పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. పంట వ్యర్థాలను కాల్చకుండా భూమిలో కలియదున్నాలని, నేలలో సారం పెంచేందుకు సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు వాడాలని పేర్కొన్నారు. వరి సాగు తగ్గించి ఆరుతడి పంటలతో పంట మార్పిడి చేపట్టాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి సంధ్య, హార్టికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ స్వప్న, వ్యవసాయ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.


