హన్మకొండ: హనుమకొండలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు గురువారం అంతరాయం కలుగనుందని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి తెలిపారు. రాంనగర్, పోలీస్ హెడ్‌క్వార్టర్, విద్యానగర్, గోకుల్ నగర్ ప్రాంతాల్లో ఉదయం 8.30 నుంచి 10.30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
హన్మకొండ అర్బన్: ఏషియన్ మాల్ సమీపంలోని సాయిబాబా మందిర ప్రాంగణంలో కిడ్నీ సంబంధిత వ్యాధుల కోసం గురువారం ఉచిత యూరాలజీ వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు చైర్మన్ మతుకుమల్లి హరగోపాల్, మందిర పీఆర్వో నిమ్మల శ్రీనివాస్ సంయుక్త ప్రకటనలో తెలిపారు. ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ బీవీ.రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు శిబిరం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
నయీంనగర్: ఈనెల 16న కాళోజీ కళాక్షేత్రంలో రాష్ట్రస్థాయి కల్చరల్ ఫెస్ట్ నిర్వహించనున్నట్లు శ్రవన్స్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ ప్రెసిడెంట్ జి.శ్రవణ్ కుమార్ తెలిపారు. హనుమకొండ ప్రెస్ క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సందీప్, భరద్వాజ్, మణివర్మ, దీపక్ తదితరులు పాల్గొన్నారు.
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాలలో కాంట్రాక్టు అధ్యాపకురాలు దాసరి ప్రసన్నరాణికి హైదరాబాద్‌లోని చైతన్య డీమ్డ్ టు బీ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. భౌతిక శాస్త్రం విభాగంలో పరిశోధకురాలిగా మానిటరింగ్ అండ్ ఎవల్యూయేషన్ ఆఫ్ స్మార్ట్ సోలార్ ఎనర్జీ సిస్టమ్స్ అనే అంశంపై సమర్పించిన పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథానికి ప్రసన్నరాణికి డాక్టరేట్‌ను వర్సిటీ ప్రదానం చేసింది. ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్ సురేష్ పర్యవేక్షణలో ప్రసన్నరాణి తన పీహెచ్‌డీ పూర్తిచేశారు.
కాజీపేట: కాజీపేట పోలీస్‌స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా జె.శ్యాంసుందర్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇప్పటివరకు పనిచేసిన ఇన్‌స్పెక్టర్ సుధాకర్ రెడ్డి.. శాయంపేట మండలానికి బదిలీ అయ్యారు. వీఆర్‌లో ఉన్న శ్యాంసుందర్‌ను కాజీపేటకు బదిలీ చేస్తూ సీపీ సన్‌ప్రిత్ సింగ్ ఆదేశాలు జారీ చేయగా, శ్యాంసుందర్ బాధ్యతలు చేపట్టారు.
కాజీపేట: కాజీపేట పట్టణానికి చెందిన వెనిశెట్టి నిర్మలాదేవి (67) నేత్రాలను ఆమె కుటుంబ సభ్యులు దానం చేశారు. స్థానిక వాసవి క్లబ్‌లో క్రియాశీలకంగా పనిచేసిన వెనిశెట్టి రఘు తల్లి నిర్మలాదేవి బుధవారం మృతి చెందారు. ఈ మేరకు కుటుంబ సభ్యుల అంగీకారంతో నిర్మలాదేవి నేత్రాలను వైద్యుల పర్యవేక్షణలో రామయమ్మ ఇంటర్నేషనల్ ఐ బ్యాంక్ సిబ్బంది బుధవారం సేకరించారు. ఈ సందర్భంగా రఘు కుటుంబ సభ్యులకు ఐ బ్యాంకు సిబ్బంది ప్రశంస పత్రం అందజేశారు.
హసన్‌పర్తి: తన ఇంటి ముందు డ్రెయినేజీ గుంత తవ్వారని జయగిరికి చెందిన రేణుకుంట్ల విజయ్ తెలిపాడు. ఈ మేరకు నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని కోరుతూ జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీరమాకాంత్‌కు బుధవారం ఫిర్యాదు చేశాడు. పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ కలిసి తన ఇంటి ముందు మురుగునీరు నిల్వ కోసం జేసీబీతో సుమారు 40 ఫీట్లలోతు గల పెద్ద గుంత తవ్వారని పేర్కొన్నాడు. దాంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.
రామన్నపేట: ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యను వరంగల్‌లోని తన నివాసంలో రాష్ట్ర మేర కార్పొరేషన్ చైర్మన్ సంగ వెంకట్రాజం బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. నాయకులు రాయబారపు సంతోష్‌కుమార్, నరేందర్, గట్ల రవీందర్, కళ్యాణ్ చక్రవర్తి, గూడూరు ప్రభాకర్, రామగిరి భిక్షపతి, సోమ పుల్లయ్య, రాకేష్ పాల్గొన్నారు.


