● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ
వరుణ్ రెడ్డి
హన్మకొండ : విద్యుత్ శాఖ సిబ్బంది ఒక్క నిమిషం నిబంధనను కచ్చితంగా పాటించాలని, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. బుధవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 18 సర్కిళ్ల ఎస్‌ఈలు, ఆయా విభాగాల డీఈలు, ఎస్‌ఎఓలు, ఏఏఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పనిని ప్రారంభించే ముందు సిబ్బంది ఒక్క నిమిషం పాటు ఆగి, అన్ని భద్రతా ప్రమాణాలు సరిగ్గా ఉన్నాయా అని నిర్ధారించుకోవాలన్నారు. జూన్ 15 నుంచి వచ్చే ఏడాది వేసవి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ఈ నెలాఖరు వరకు అన్ని 11కేవీ ఫీడర్ల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. విద్యుత్ లైన్లలో సింగిల్ ఫేజ్, త్రీ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఏబీ స్విచ్‌లు బిగించాలన్నారు. 33 కేవీ, 11 కేవీ లైన్ల ఏఐ మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. కొత్త జిల్లా స్టోర్లు, కొత్త ఎస్పీఎం షెడ్‌లు త్వరితగతిన అందుబాటులోకి తీసుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సీఈలు కె.తిరుమల్ రావు, రాజు చౌహాన్, అశోక్, సురేందర్, సీజీఎంలు రవీంద్రనాథ్, రౌతు చరణ్ దాస్, కిషన్, జీఎంలు శ్రీకాంత్, శ్రీనివాస్, మధుసూదన్ రావు, మల్లికార్జున్, కృష్ణ మోహన్, జయరాజ్, వెంకటకృష్ణ, ఉపేందర్, వాసుదేవ్, ప్రభావతి, డీఈలు అనిల్ కుమార్, నాగరాజు పాల్గొన్నారు.


