ప్రజలు చూపిన తోవలో నడుస్తా..
హన్మకొండ: ‘ప్రజలే నాయకులు.. వారు చూపిన తోవలో నడుస్తా’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి జనం బాటలో భాగంగా ఆదివారం హనుమకొండ సుబేదారిలోని రాయల్ గార్డెన్స్‌లో మేధావుల సదస్సులో ఆమె మాట్లాడుతూ.. వరంగల్ నగరంలో స్మార్ట్ సిటి వంటి పథకాలు వచ్చినా అభివృద్ధి సాధించలేదన్నారు. ప్రజావేదిక చైర్మన్ తిరునహరి శేషు మాట్లాడుతూ.. దివంగత మహానేత వైఎస్సార్‌లా పేరు సంపాదించాలని కవితకు సూచించారు. ప్రజాకవి కాళోజీ నారాయణ రావు, తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి కల్వకుంట్ల కవిత పూలమాల వేసి నివాళి అర్పించారు.
జానపద అకాడమీ ఏర్పాటు చేయాలి
వరంగల్: తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కళాకా రులకు పింఛన్లు అందించేందుకు తెలంగాణ జానపద అకాడమీని ఏర్పాటు చేయాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ‘జాగృతి జనంబాట’లో భాగంగా ఆదివారం వరంగల్ ఎస్‌ఆర్ నగర్‌ను ఆమె సందర్శించారు. అనంతరం కేవీఎస్ ఫంక్షన్ హాల్‌లో కళాకారుతో సమావేశం నిర్వహించారు. జనగామ జిల్లాకు చెందిన అమరుడైన బాల్నే కొమరయ్య భార్య పూలమ్మ మాట్లాడుతూ.. తన భర్త తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసినా నేటి వరకు ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. స్పందించిన కవిత బాధితురాలు పూలమ్మ పిల్లల పోషణ, చదువు బాధ్యతలు తీసకుంటున్నట్లు ప్రకటించి ఆమెను సన్మానించారు.
ఎమ్మెల్యేల కబ్జాల వల్లే నగరం మునిగింది..
నయీంనగర్: ఎమ్మెల్యేల కబ్జాల వల్లే వరంగల్ నగరం ధ్వంసమైందని, రెండో రాజధానిగా పేరుగాంచిన వరంగల్ మునిగిపోయిందంటే సిగ్గుచేటని కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం హనుమకొండ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నా.. కేయూ మహిళా ఇంజనీరింగ్ కాలేజీలో 1,100 మంది విద్యార్థులకు హాస్టల్ వసతి లేకపోవడం సిగ్గుచేటన్నారు.
ఓరుగల్లు డయాసిస్ సేవలు అభినందనీయం
కాజీపేట రూరల్: ఓరుగల్లు మేత్రాసనం (డయాసిస్) సేవలు అభినందనీయమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కాజీపేట ఫాతిమా కేథడ్రల్ చర్చి ప్రాంగణంలో ఆదివారం రాత్రి సువార్త ప్రచార వేడుకల్లో భాగంగా జరిగిన ఆనంద హేల కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు
కల్వకుంట్ల కవిత


