
సమస్యలతో ప్రజలు సతమతం
న్యూశాయంపేట: నగర వ్యాప్తంగా ప్రజలు పలు సమస్యలతో సతమతం అవుతున్నారు. వరంగల్ నగరంలోని ఖమ్మం హైవే శంభునిపేట జంక్షన్ వద్ద ఉన్న ఓ బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగా ప్రధాన రహదారిపై తాగునీటి పైపులైన్ లీకేజీ అయింది. దాంతో అక్కడ ప్రమాదకరంగా గుంత ఏర్పడింది. ఈ మార్గంలో నిత్యం వేలాది భారీ వాహనాలు, కార్లు, ద్విచక్ర వాహనదారులు ప్రయాణిస్తూ ఉంటారు. గుంతలో నీరు నిలిచి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బల్దియా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.
మట్టి రోడ్డుతో ఇబ్బందులు
ఖిలా వరంగల్: వరంగల్ 41వ డివిజన్ ఉర్సు ప్రతాప్‌నగర్ నాగమయ్య గుడి కమాన్ సమీపంలోని ఓ వీధి ఇరుకుగా ఉండడంతో రాకపోకలకు తీవ్ర ఇక్కట్లు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. కాలనీ ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో మట్టి రోడ్డు రోజు రోజుకు కుంచించుకుపోతోందని చెబుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా పిచ్చిమొక్కలు పెరిగి వాహన రాకపోకలకు ఆటంకంగా మారాయని తెలిపారు. దీనిపై బల్దియా అధికారులకు గ్రీవెన్ సెల్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి మట్టి రోడ్డును విస్తరించి, సీసీ రోడ్డు వేయాలని కోరుతున్నారు.

సమస్యలతో ప్రజలు సతమతం