
ఓవర్ లోడ్..
హసన్‌పర్తి: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లారీల యజమానులు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. పరిమితికి మించి ఓవర్ లోడ్‌తో ఇసుకను తరటిస్తున్నారు. రెండు రోజుల క్రితం విజిలెన్స్, మైనింగ్, కమర్షల్ ట్యాక్స్, ఆర్టీఏ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి అధిక లోడ్‌తో వెళ్తున్న 16 ఇసుక లారీలను పట్టుకున్నారు.
ఆరు రోజుల క్రితం 16 లారీలు ఇసుక కోసం కరీంనగర్ జిల్లా తాడిచెర్ల ఇసుక రీచ్‌కు వెళ్లాయి. వర్షం కారణంగా ఇసుక నింపడంలో ఆలస్యం జరిగింది. ఇసుక లోడ్ చేసుకున్న ఆ లారీలు రెండు రోజుక్రితం వాటి గమ్యస్థానాలకు బయల్దేరాయి. మార్గ మధ్యలో ఆర్టీఏ, విజిలెన్స్, కమర్షల్ ట్యాక్స్‌తో పాటు మైనింగ్ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లారీల్లో పరిమితికి మించి ఇసుక ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఒక్కో లారీని తూకం వేయగా, సుమారు 5టన్నుల నుంచి 6 టన్నుల వరకు ఇసుక అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు ఆ లారీలను హసన్‌పర్తి చింతగట్టు క్యాంపులోని ఆర్టీఏ కార్యాలయానికి తరలించారు.
ప్రతీ డిపార్ట్‌మెంట్‌కు చలాన్ కట్టాల్సిందే..
పరిమితికి మించి ఇసుకతో పట్టుబడిన లారీలు అక్కడ తనిఖీలు నిర్వహించిన అన్ని శాఖలకు చలాన్ కట్టాల్సి ఉంటుందని అధికారి ఒకరు తెలిపారు. దాంతో లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూకంలో హెచ్చుతగ్గుల కారణంగా పరిమితికి మించి లారీల్లో ఇసుక లోడ్ అయినట్లు లారీ యజమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకు టీజీఎండీసీ కార్పొరేషన్, సంస్థ, సదరు కాంట్రాక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఓవర్‌లోడ్ అంటూ తమకు జరిమనా విధించొద్దని వేడుకుంటున్నారు.
పరిమితికి మించి ఇసుక రవాణా
తనిఖీల్లో 16 లారీల పట్టివేత