
శరణాగతి కోరుతూ ఆర్తిగా వెలువరించారు
హన్మకొండ కల్చరల్: పద్యరూపంలో దేవుని శరణాగతి కోరుతూ ఆర్తిగా ‘భక్తి మందారాలు’ పుస్తకం వెలువరించారని అష్టావధాని చేపూరి శ్రీరామ్ అన్నారు. వరంగల్ కాకతీయ పద్యవేదిక ఆధ్వర్యంలో హనుమకొండ లష్కర్‌బజార్‌లోని ప్రాక్టీసింగ్ స్కూల్‌లో ‘కవిచంద్ర’ నర్సింగోజు లక్ష్మయ్య రాసిన భక్తి మందారాలు పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం ఉదయం జరిగింది. పద్యకవి డాక్టర్ ఎన్వీఎన్ చారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా విశ్రాంత విద్యాశాఖాధికారి డాక్టర్ దహగం సాంబమూర్తి, విశిష్ట అతిథిగా డాక్టర్ యెల్లంభట్ల నాగయ్య, చేపూరి శ్రీరామ్ పాల్గొని పుస్తకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా చేపూరి శ్రీరామ్ పుస్తక సమీక్షకుడిగా వ్యవహరించగా, దహగం సాంబమూర్తి మాట్లాడుతూ పద్యం ప్రాభవాన్ని కాపాడాలని కోరారు. పుస్తక రచయిత నర్సింగోజు లక్ష్మయ్య మాట్లాడుతూ నీతిని బోధిస్తూ సమాజానికి ఉపయోగపడే విధంగా పుస్తక రచన చేశానని తెలిపారు. నేటి కాలంలో పద్యం ప్రాధాన్యతను ఎన్వీఎన్ చారి వివరించారు. కార్యక్రమంలో కవితా వేదిక నిర్వాహకులు అక్కెర కరుణాసాగర్, కొండా యాదగిరి, ప్రభాకర్, శ్రీనివాస్, ఆనందాచారి, సిద్దంకి బాబు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన పద్యకవి కమ్మేళనంలో కవులు తమ కవితలను వినిపించారు.
అష్టావధాని చేపూరి శ్రీరామ్
భక్తి మందారాలు పుస్తకం ఆవిష్కరణ