
జీపీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి
హన్మకొండ చౌరస్తా: గ్రామాభివృద్ధే ధ్యేయంగా సమయపాలన లేకుండా నిరంతరం పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులను మల్టీ పర్పస్ వర్కర్స్ విధానం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య అన్నారు. యూనియన్ జిల్లా రెండో మహాసభలు హనుమకొండ అలంకార్ జంక్షన్‌లోని టీఎన్జీఓఎస్ భవన్‌లో ఆదివారం జరిగాయి. తొలుత వేయి స్తంభాల గుడి నుంచి భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఐటీయూ జెండాను జిల్లా అధ్యక్షుడు పల్లె రామన్న ఆవిష్కరించారు. సభకు వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక మంది కార్మికులు విధి నిర్వహణలో మృతిచెందారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. సభలో సీఐటీయూ నాయకులు రాగుల రమేష్, బొట్ల చక్రపాణి, గబ్బెట యాకయ్య, బండ సాంబయ్య, బోగం రమేష్, సుఖేందర్, కుమారస్వామి, సుశీల, ఏసేబు, సుందర్ పాల్గొన్నారు