
సిక్కుల అభ్యున్నతికి పాటుపడతా
● ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
హన్మకొండ చౌరస్తా: సిక్కుల ఆర్థిక పురోగతి, వసతుల కల్పన, మెరుగైన జీవన ప్రమాణాల పెంపునకు పాటుపడతానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. హనుమకొండ 9వ డివిజన్ కాకతీయ కాలనీలో ఎమ్మెల్యే నాయిని ఆదివారం పర్యటించారు. నిర్మాణంలో ఉన్న సిక్కుల గురుద్వార్ ఆలయాన్ని పరిశీలించారు. నిర్మాణం పూర్తి కావడానికి కావాల్సిన అనుమతులు, సాంకేతిక సహాయం కోసం తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గురుద్వార్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాకతీయ కాలనీలోని రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థలను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఎండి.జాఫర్, నాయకులు బీమా వినయ్, అనిల్, గోపి, సారయ్య, ఆజాద్‌సింగ్, పూజారి సింగ్, తారుసింగ్ తదితరులు పాల్గొన్నారు.