
చలించి.. స్నేహితున్ని చేరదీసి
హసన్‌పర్తి: కుటుంబ సమస్యల కారణంగా మానసిక వేదనకు గురైన ఓయువకుడు రెండేళ్లుగా శ్మశాన వాటికలో జీవనం సాగిస్తున్నాడు. విషయం తెలుసుకున్న మిత్రులు స్నేహితుల దినోత్సవం (ఆదివారం) రోజున అతడిని శ్మశాన వాటిక నుంచి బయటికి తీసుకొచ్చి రిహబిటేషన్ సెంటర్‌లో చేర్పించారు. హసన్‌పర్తికి చెందిన వెగల్‌దాస్ రమేశ్‌కు తల్లిదండ్రులు మృతి చెందగా ముగ్గురు సోదరీమణులున్నారు. కుటుంబ సమస్యలు తలెత్తడంతో రెండేళ్లుగా రమేశ్ ఇంటికి రాకుండా శ్మశాన వాటికలోనే ఉంటూ ఎవరైనా మరణిస్తే వారి బంధువులు తీసుకొచ్చిన ఆహార పదార్థాలు తింటూ జీవనం సాగిస్తున్నాడు. అతడి పరిస్థితిని గమనించిన రమేశ్ బాల్య స్నేహితులు ఆదివారం రమేశ్‌కు హెయిర్ కట్ చేయించారు. కొత్త డ్రెస్స్‌ను కొనిచ్చి సామూహికంగా భోజనం చేశారు. అనంతరం హనుమకొండలోని హెల్పింగ్ హ్యాండ్ రీ హబిటేషన్ సెంటర్‌లో చేర్పించారు. ఇందులో బాల్య మిత్రులు కడారి పరమేశ్వరచారి, ఆరెల్లి వెంకటస్వామి, రాజ్‌కుమార్, అహ్మద్, గుడికందుల సురేశ్, బొనగాని రమేశ్, మట్టెడ యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.
శ్మశానంలో జీవనం సాగిస్తున్న
దోస్తుకు చేయూత
ఆశ్రమంలో చేర్పించిన మిత్రులు