
అమ్మవారిని దర్శించుకున్న దేవాదాయశాఖ ఆర్‌జేసీ
హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళి దేవాలయాన్ని శనివారం దేవాదాయశాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ మల్లెల రామకృష్ణారావు కుటుంబసమేతంగా సందర్శించారు. ఆయన వెంట సినీ దర్శకుడు నెల్లుట్ల ప్రవీణ్ చందర్ ఉన్నారు. వారిని ఆలయ అర్చకులు భద్రకాళి శేషు ఘనంగా స్వాగతించారు. అమ్మవారికి పూజలు నిర్వహించుకున్న అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. అలాగే తెలంగాణ రాష్ట్ర అయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి దంపతులు తమ వివాహవార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కాజీపేట జంక్షన్‌కు
నేడు రైల్వే డీఆర్‌ఎం
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్‌లో ఈనెల 3న దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) డాక్టర్ గోపాలకృష్ణన్ పర్యటించనున్నారు. ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం ప్రత్యేక రైళ్లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరి కాజీపేట జంక్షన్‌కు చేరుకుంటారు. అనంతరం జంక్షన్‌లోని రైల్వే యార్డు, డ్రైవర్ల కార్యాలయం, రన్నింగ్ రూంలను తనిఖీ చేస్తారు. కాజీపేట రైల్వే జనరల్ ఇనిస్టిట్యూట్‌ను తనిఖీతో పాటు కాజీపేట జంక్షన్‌లో నిర్మించిన షటిల్ కోర్టును ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
హనుమకొండ
డీఆర్‌ఓగా రాజా గౌడ్
హన్మకొండ అర్బన్ : హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారిగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.రాజాగౌడ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకాలం డీఆర్‌ఓగా పనిచేసిన వైవీ గణేష్‌కు ఇంకా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న రాజాగౌడ్‌కు హనుమకొండ కేటాయించారు. సోమవారం ఆయన విధుల్లో చేరనున్నట్లు సమాచారం.
వరంగల్ విద్యార్థులకు
బంగారు పతకాలు
హన్మకొండ: వరంగల్ వ్యవసాయ కళాశాల విద్యార్థులకు బంగారు పతకాలు లభించాయి. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవంలో అవార్డుల ప్రదానం జరిగింది. యూనివర్సిటీ చాన్సలర్, గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, ఐసీఏఆర్ డైరక్టర్ జనరల్, డీఏఆర్‌ఈ సెక్రటరీ మంగీలాల్ జాట్ ముఖ్యఅతిథిలుగా పాల్గొని అవార్డులు అందించారు. వరంగల్ వ్యవసాయ కళాశాలకు చెందిన ఆర్షియా తబస్సమ్‌కు నాలుగు బంగారు పతకాలు, బండెవాల శ్వేత, ఏనుగు మానసకు బంగారు పతకం అందుకున్నారు. అవార్డులు అందుకున్న విద్యార్థులను వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధ్యాపకులు అభినందించారు.
వయోవృద్ధుల
డే కేర్ సెంటర్ ప్రారంభం
హన్మకొండ అర్బన్ : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, హనుమకొండ శాఖ ఆధ్వర్యంలో వయోవృద్ధుల కోసం ఏర్పాటు చేసిన డే కేర్ సెంటర్‌ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, రెడ్ క్రాస్ సొసైటీ ప్యాట్రన్ నాయిని రాజేందర్‌రెడ్డి శనివారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని 33జిల్లాల్లో 37 డే కేర్ సెంటర్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ డా.పి.విజయచందర్‌రెడ్డి, సభ్యులు ఎమ్మెల్యేను సత్కరించారు. అనంతరం వృద్ధులను చేనేత టవల్స్‌తో సత్కరించారు. తలసేమియా పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సొసైటీ కోశాధికారి బొమ్మిరెడ్డి పాపిరెడ్డి, సభ్యులు ఈవీ శ్రీనివాస్‌రావు, వేణుగోపాల్, శేషుమాధవ్, రమణారెడ్డి, మహిళా శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ అధికారి జయంతి, అనితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అమ్మవారిని దర్శించుకున్న దేవాదాయశాఖ ఆర్‌జేసీ