
వయోవృద్ధులకు వైద్య సేవలందించాలి
వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి
నిర్మలాగీతాంబ
ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రిలో వయోవృద్ధులకు మెరుగైన వైద్య సేవలందించాలని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ పేర్కొన్నారు. సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ హనుమకొండ ఆధ్వర్యంలో వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం–2007పై ఎంజీఎంలో శనివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడుతూ వయోవృద్ధులకు ప్రత్యేక వార్డులు, ఇతర సౌకర్యాలను కల్పించి వైద్య సేవలందించాలన్నారు. ప్రతి కుటుంబంలో కొడుకులు, కోడళ్లు, కుమార్తెలు పెద్దవారిపై ప్రేమ, గౌరవ మర్యాదలతో మెలగాలని, వీరిని చూసి ఇంట్లో పిల్లలు కూడా పెద్దవారితో ప్రేమగా మెలుగుతారని తెలిపారు. పెద్దవారి ఆస్తులను అనుభవిస్తూ వారిని అనాథ ఆశ్రమాల్లో వదిలివేయడం సరైంది కాదన్నారు. ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ కిశోర్ మాట్లాడుతూ వయోవృద్ధులకు ప్రత్యేక ఓపీ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శిక్షణలో హెల్పేజ్ ఇండియా సంస్థ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్యాంకుమార్, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎం.సాయికుమార్, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోయేషన్ కార్యదర్శి తేరాల యుగేందర్, దామోదర్, నర్సయ్య, రవీందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.