
రేపటినుంచి ప్రైవేట్ ఆస్పత్రుల తనిఖీలు
హసన్‌పర్తి: హనుమకొండ జిల్లాలో నిర్వహిస్తున్న ప్రైవేట్ క్లినిక్‌లు, ఆస్పత్రులను సోమవారంనుంచి తనిఖీలు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యాధికారి అప్పయ్య తెలిపారు. హసన్‌పర్తి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో శనివారం ఆయన ప్రత్యేక బృందం సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనిఖీల కోసం డాక్టర్, హెల్త్‌అసిస్టెంట్‌తోపాటు 15 మందితో కూడిన బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తనిఖీల సందర్భంగా క్లినిక్, ఆస్పత్రి నిర్వహణకు అనుమతి ఉందా? అనుమతి ఉంటే క్లినిక్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం మేరకు నిర్వహిస్తున్నారా అన్న వివరాలు సేకరిస్తారన్నారు. వైద్యుల పేర్లు, వారు అందిస్తున్న వివరాల పట్టిక, పొల్యూషన్ సర్టిఫికెట్, బయో మెడికల్ సర్టిఫికెట్, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తున్నారా.. లేదా అన్న అంశాలను సైతం పరిశీలించనున్నట్లు చెప్పారు. నిబంధలకు విరుద్ధంగా క్లినిక్ నిర్వహించినట్లయితే తనిఖీల్లో వెల్లడైన పక్షంలో సదరు క్లినిక్ నిర్వాహకుడికి నోటీసులు జారీ చేయడమే కాకుండా జరిమానాలు కూడా విధిస్తామని హెచ్చరించారు. సమావేశంలో డాక్టర్ భార్గవ్, జిల్లా మాస్ మీడియా అధికారి డాక్టర్ అశోక్‌రెడ్డి, గణాఽంకాధికారి జి.ప్రసన్నకుమార్, డాక్టర్లు, హెల్త్ అసిస్టెంట్లు,సిబ్బంది పాల్గొన్నారు.
ఈజేహెచ్‌ఎస్ తనిఖీ
హన్మకొండ చౌరస్తా: హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ఆవరణలోని ఈజేహెచ్‌ఎస్ వెల్‌నెస్ సెంటర్‌ను శనివారం డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య తనిఖీ చేశారు. మెడికల్ స్టాక్ రికార్డులు, ఓపీలో వైద్యసేవలు, ల్యాబ్ ఇతర విభాగాలను పరిశీలించారు. ఆయనవెంట కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ నిఖిల్, డాక్టర్లు చరణ్, సుస్మిత, చైతన్య తదితరులు ఉన్నారు.
బాలింతలకు అవగాహన కల్పించాలి
తల్లిపాల ప్రాముఖ్యతపై బాలింతలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌ఓ అప్పయ్య సిబ్బందికి సూచించారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా శనివారం హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయ న మాట్లాడారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు ఇచ్చే సూచనలను తల్లులు పాటించాలన్నారు. కార్యక్రమంలో జీఎంహెచ్ సూ పరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి జయంతి, కేయూ పాలక మండలి సభ్యురాలు అనితారెడ్డి, డాక్టర్లు మహేందర్, సుబాష్, సీడీపీఓ విశ్వజ, గీత, అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.
హనుమకొండ వైద్యాధికారి అప్పయ్య