
వరంగల్ జిల్లాలో ‘మిషన్ తేజస్’
విద్యారణ్యపురి: సమగ్రశిక్ష తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్‌నికోలస్ అనుమతితో వరంగల్ జిల్లాకు చెందిన ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థి గుండు అనిరుధ్ ఆధ్వర్యంలో మిషన్ తేజస్ (తెలంగాణ జ్ఞాన ఆవిష్కరణ సంకల్పం) నూతన ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించి ఆ స్కూళ్లను స్మార్ట్ ఇన్నోవేషన్‌గా మార్చేందుకు దోహదపడుతుంది. ప్రభుత్వానికి లేదా పాఠశాల విద్యాశాఖకు ఎలాంటి ఆర్థిక బాధ్యత ఉండొద్దనే నిబంధనతో ఈ కార్యక్రమానికి అనుమతినిస్తూ సమగ్రశిక్ష రాష్ట్ర డైరెక్టర్ అనుమతి ఇచ్చారు. ఈ మేరకు ఆ ప్రాజెక్టు అడిషనల్ డైరెక్టర్ ఎం. రాధారెడ్డి ఈనెల 1న ప్రొసీడింగ్ జారీ చేశారు. ఈ మిషన్ ప్రారంభదశలో వరంగల్ జిల్లా విద్యాశాఖాధికారికి జిల్లాలోని 10 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి అమలు చేయాలని పేర్కొన్నారు. సంబంధిత ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎంలు, ప్రతీ విద్యార్థి భద్రత,సైబర్ భద్రతాపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఆమోదం లభించింది. శనివారం అనిరుధ్ తన తండ్రితో కలిసి వరంగల్ జిల్లా డీఈఓ మామిడాల జ్ఞానేశ్వర్‌ను కలిశారు. త్వరలోనే 10 ప్రభుత్వ పాఠశాలలను ఎంపికచేసే అవకాశం ఉంది.
మిషన్ రూపకర్త వరంగల్ కుర్రాడు
గుండు అనిరుధ్