
జాతీయ స్థాయి ప్రమాణాలతో క్రీడాపాఠశాల
ఎమ్మెల్యే కడియం శ్రీహరి
హన్మకొండ అర్బన్ : వరంగల్ నగరంలో ఏర్పాటుచేసే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ క్రీడా పాఠశాలను జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉండాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులకు సూచించారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుపై గురువారం హనుమకొండ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ స్నేహ శబరీష్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్‌తో కలిసి ఎమ్మెల్యే శ్రీహరి పాల్గొన్నారు. వరంగల్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. పంద్రాగస్టు నుంచి క్రీడా పాఠశాల ప్రారంభానికి అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ అధికారులకు సూచించారు. తాత్కాలిక క్రీడా పాఠశాల ఏర్పాటుకు ప్రస్తుతం జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో మరమ్మతు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 80 మంది విద్యార్థులతో పాఠశాల ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. హాస్టల్ వసతి, ఇండోర్, అవుట్ డోర్ క్రీడలకు కావాల్సిన ఏర్పాట్లు, తరగతి గదులను ఏర్పాటు చేయాలని సూచించారు. పాఠశాల ఏర్పాటుకు సంబంధించిన జీఓను విడుదలకు తాము కృషి చేస్తామని, అధికారులు త్వరితగతిన ఏర్పాట్లు పూర్తి చేయాలని కోరారు. అలాగే జీఓ విడుదల అయిన వెంటనే కలెక్టర్ భూ బదలాయింపునకు కావాల్సిన చర్యలతోపాటు అత్యుత్తమ పాఠశాల నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్ సిద్ధం చేయాలని సూచించారు. ఈ మేరకు నేడు (శుక్రవారం) జేఎన్‌ఎస్‌ను అందరం కలిసి పరిశీలిద్దామని, అవసరమైన మరమ్మతులు, మౌలిక వసతుల కల్పనపై అక్కడే చర్చిద్దామని అధికారులకు సూచించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ అధికారులు, జిల్లా యువజన క్రీడా అధికారులు, రెవెన్యూ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.