న్యూస్‌రీల్
గుంటూరు నగర మేయర్ స్థానంపై టీడీపీ సామాజిక వర్గం కన్ను చినబాబును ప్రసన్నం చేసుకునే పనిలో ఆశావాహులు జనరల్ మహిళకు రిజర్వుతో భార్యలను బరిలో దింపే యోచనలో నేతలు లోకేష్‌ను కలిసిన తరువాత సీటు తమదేనంటూ శిరీష వర్గం ప్రచారం భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు ఎన్నికలముందు పార్టీలో చేరిన వారికి ఎలా ఇస్తారంటూ మండిపాటు జనసేన, బీజేపీకి మళ్లీ మొండి చెయ్యే
గుంటూరు
బుధవారం శ్రీ 14 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
జనసేన, బీజేపీ వారికి నిరాశే...
గుంటూరు నగర మేయర్ స్థానం జనరల్ మహిళకు రిజర్వు కావడంతో అన్ని పార్టీల్లో పోటీ ఎక్కువగా ఉంది. గుంటూరు నగరంలో అధికార టీడీపీ సామాజిక వర్గం మేయర్ సీటుపై కన్నేసింది. ఎలాగైనా తమలో ఒకరికి దక్కాలని భావిస్తూ ఆశావాహులంతా పైరవీలు చేస్తున్నారు. ముఖ్యంగా చినబాబును ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా మారిపోయారు.
సాక్షిప్రతినిధి, గుంటూరు: నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో తమ పేర్లతో విపరీతంగా ప్రచారం చేసుకున్న ద్వితీయ శ్రేణి నేతలంతా ఇప్పుడు తమ సతీమణులను ముందు పెట్టి రాజకీయంగా చక్రం తిప్పేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత జరిగే ఎన్నికలు కావడంతో నగరంలో పెత్తనం చెలాయించవచ్చనే కోణంలో టీడీపీ సామాజిక వర్గానికి చెందిన వారు పదుల సంఖ్యలో బయటకు వచ్చి తమ వర్గం ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. పార్టీలో కేంద్ర మంత్రికి అనుకూలంగా ఉండేవారు ఒకవర్గంగా, చినబాబు ద్వారా మరో వర్గం, సీనియర్ నేతల ద్వారా మరికొందరు తమ వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు.
కాపు నేతల ఆశలు
మేయర్ సీటు జనరల్ మహిళకు కేటాయించడంతో ఇప్పటి వరకు జిల్లాలో ఇచ్చిన పదవుల్లో కాపులకు అన్యాయం జరిగిందనే కోణంలో ఆ సామాజిక వర్గం నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా టీడీపీ నేత డేగల ప్రభాకర్ తన సతీమణికి అవకాశం ఇవ్వాలంటూ ముమ్మర ప్రయత్నాలు చేస్తుండగా, మాజీ మంత్రి శనక్కాయల అరుణ కోడలు సైతం తనకు అవకాశం ఇవ్వాలంటూ అధిష్ఠానాన్ని కోరారు. ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో ఇచ్చిన 50కుపైగా జిల్లా, రాష్ట్రస్థాయి పదవుల్లో రెండు మినహా మిగతావి టీడీపీ సామాజిక వర్గానికే దక్కిన విషయాన్ని గుర్తు చేస్తూ కాపులు అధికంగా ఉన్న గుంటూరు మేయర్ స్థానాన్ని తమకు కేటాయించాలని ముఖ్య నేతల వద్ద కాపు నేతలు తమ వాదనలు వినిపిస్తున్నారు. తొలుత ఉగ్గిరాల సీతారామయ్య పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ ఆయన గత కొంతకాలంగా యాక్టివ్‌గా లేకపోవడాన్ని మిగతా నేతలు గుర్తు చేశారు. తమకు అవకాశం ఇవ్వాలంటూ టీడీపీ కేంద్ర కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
శిరీష వర్గం ప్రచారంపై మండిపాటు
ఎన్నికల ముందు వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన భీమనాథం భరత్‌రెడ్డి రెండు రోజులక్రితం నారా లోకేష్‌ను కలిశారు. మేయర్ స్థానంపై తమకు హామీ లభించిందని శిరీష వర్గం సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో టీడీపీ శ్రేణులంతా భగ్గుమన్నాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ పరాజయం పాలైన సమయంలో సైకిల్‌ను రోడ్డుపై లాక్కెళుతూ అవమానించిన భరత్‌రెడ్డి సతీమణికి సీటిస్తే అంగీకరించేదే లేదంటూ హెచ్చరికలు చేశారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన భరత్‌రెడ్డికి తన సతీమణి శిరీష బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారనే పేరుతో సీటిస్తే ఒప్పుకొనేది లేదంటూ టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి.
మేయర్ స్థానం కోసం టీడీపీలో కమ్మ, కాపులతోపాటు, ఇతర సామాజిక వర్గాల నేతలు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనసేన నుంచి నాదెండ్ల మనోహర్‌కు మినహా ఎవరికీ ఉన్నత స్థాయి పదవి దక్కలేదు. కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న గుంటూరు మేయర్ స్థానాన్ని తమకు కేటాయించాలని అధిష్ఠానం వద్ద వాదనలు వినిపిస్తున్నట్లు సమాచారం. బీజేపీ సైతం క తమకు అన్యాయం జరిగిందని.. కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ స్థానం కాకపోయినా, కనీసం సముచిత స్థాయిలో డివిజన్లలో తగినన్ని సీట్లు కేటాయించాలనే వాదనలు తెరపైకి తెచ్చింది.


