మెప్మా నిధుల గోల్‌మాల్‌పై విచారణ | - | Sakshi
Sakshi News home page

మెప్మా నిధుల గోల్‌మాల్‌పై విచారణ

Oct 14 2026 3:59 AM | Updated on Oct 14 2026 3:59 AM

‘సాక్షి’ కథనాలకు స్పందించిన కమిషనర్‌

నెహ్రూనగర్‌: మెప్మా పరిధిలో పేద మహిళల పొదుపు నిధులు పక్కదారి పట్టిన వ్యవహారంపై నగరపాలక సంస్థ కమిషనర్‌ మయూర్‌ అశోక్‌ స్పందించారు. పేద మహిళల కష్టార్జితాన్ని సొంతానికి వాడుకున్న వైనంపై ‘సాక్షి’ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమైన నేపథ్యంలో యంత్రాంగం కదిలింది. దీనిపై సమగ్ర విచారణ బాధ్యతలు స్వర్ణగ్రామ, వార్డు సచివాలయాల విభాగం అదనపు కమిషనర్‌ రవీంద్రకు అప్పగించారు. కమిషనర్‌ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన రవీంద్ర.. మంగళవారం బాధితులైన డ్వాక్రా గ్రూపు సభ్యులను క్షేత్రస్థాయిలో విచారించి వివరాలు సేకరించారు. ఆత్మహత్యాయత్నం వరకు వెళ్లిన శ్రీనివాసరావుపేటకు చెందిన ఓ డ్వాక్రా గ్రూపు వ్యవహారంలో వెలుగుచూసిన ఈ కుంభకోణం నగరంలో తీవ్ర కలకలం రేపింది. గ్రూపు సభ్యులు బ్యాంకు రుణం వాయిదాల మొత్తాన్ని సక్రమంగానే రిసోర్స్‌ పర్సన్‌ (ఆర్పీ)కి చెల్లించారు. అయితే, ఆర్పీతో పాటు కమ్యూనిటీ ఆర్గనైజర్‌ (సీఓ) కుమ్మకై ్క ఆ నిధులను బ్యాంకు ఖాతాలో జమ చేయకుండా స్వాహా చేసినట్లు గ్రూపు సభ్యులు ఆరోపిస్తున్నారు. అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగకపోగా, తీవ్ర ఒత్తిళ్లకు లోనైన గ్రూప్‌ లీడర్‌ మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. దీనిపై నగరంపాలెం పోలిస్‌ స్టేషన్‌లో కేసు కూడా నమోదైన విషయం తెలిసిందే. ఈ దారుణంపై మొదట్లో మెప్మా ఉన్నతాధికారులే సొంత సిబ్బందితో నామమాత్రపు విచారణ జరిపించి కేసును నీరుగార్చేందుకు యత్నించారు. అధికారుల తీరుపై ఈనెల 12న ‘సాక్షి’లో సొంత సిబ్బందితోనే విచారణ..! ప్రచురితమైన కథనం ఉన్నతాధికారుల్లో కదలిక తెచ్చింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు సీఓ ఆదినారాయణ వ్యవహారంపై విచారణ సాగుతున్న క్రమంలో మరిన్ని దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆర్పీలను పూర్తిగా తన గుప్పెట్లో పెట్టుకుని, గ్రూపుల్లో ఎవరికై తే రుణాలు అవసరం లేదో వారి వివరాలను సేకరించి వారి పేర్లతో సీఓనే లోన్లు తీసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన పర్యవేక్షణలోని గ్రూపులను లోతుగా పరిశీలిస్తే లక్షలాది రూపాయల స్వాహా వ్యవహారం తేలుతుందని మెప్మా సిబ్బందే చెప్పుకోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement