● గుంటూరు జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎస్సీ మహిళకు చాన్స్
● బాపట్ల, పల్నాడు జెడ్పీ చైర్పర్సన్లుగా జనరల్ మహిళలకు అవకాశం
సాక్షిప్రతినిధి, గుంటూరు: మూడు జిల్లాలుగా ఉమ్మడి గుంటూరు జిల్లా విడిపోయిన తరువాత మొట్టమొదటిసారిగా వచ్చే జెడ్పీ ఎన్నికలకు రిజర్వేషన్ ఖరారైంది. మూడు జెడ్పీ చైర్పర్సన్ పదవులు మహిళలకే దక్కడం విశేషం. గుంటూరు జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎస్సీ మహిళకు, పల్నాడు, బాపట్ల జెడ్పీ చైర్పర్సన్ సీట్లు జనరల్ మహిళలకు రిజర్వు అయ్యాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మూడు జిల్లాలకు ప్రథమ పౌరులుగా మహిళలకే అవకాశం దక్కనుంది. కొత్త జిల్లాలకు మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరుగుతుండడంతో మొదటి సారి జెడ్పీ చైర్పర్సన్లు అయ్యే భాగ్యం మహిళలకే దక్కింది.
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్య క్షేత్రంపై ధనలక్ష్మి అమ్మవారికి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ఉదయం తొమ్మిది గంటలకు విశేష అభిషేక మహోత్సవం, కుంకుమార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటలకు శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, ధనలక్ష్మి అమ్మవారి పల్లకీ సేవ, అర్చన, నివేదన, మంగళాశాసనం కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి వారి మంగళాశాసనములతో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తాడేపల్లి రూరల్: విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ వ్యవస్థలతోపాటు యువత భాగస్వామ్యం ఎంతో అవసరమని ఏపీ ఎస్డీఎంఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కౌసర్ బానో అన్నారు. మంగళవారం తాడేపల్లిలోని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో ఇంటి నుంచే స్థితి స్థాపకత ప్రారంభం అనే అంశంపై రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, యునిసెఫ్ సంయుక్త ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కౌసర్ బానో మాట్లాడుతూ విపత్తుల సమయంలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ, శిక్షణ, అవగాహన కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరినీ సంసిద్ధులుగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. విపత్తు సంసిద్ధత, ప్రమాదాల నివారణ, అవగాహన పెంపు, సామర్థ్యాల బలోపేతంపై విస్తృతంగా అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో విపత్తుల నివారణ సంస్థ ఏవో రవిబాబు, ఎస్ఈవోసీ ఇన్చార్జి పీటర్, ప్రాజెక్టు కో ఆర్డినేటర్ డాక్టర్ బి.ప్రసాద్, సీబీవో తనూజ, ప్రాజెక్టు మేనేజర్లు, ఫైర్ డిపార్ట్మెంట్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, మై భారత్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, యువజన విభాగాల కీలక అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
నరసరావుపేట ఈస్ట్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యాన జాతీయస్థాయిలో నిర్వహించనున్న అండర్–14 బాలికల టెన్నిస్ రాష్ట్ర జట్టు కెప్టెన్‌గా సీబీఐటీ స్కూల్ విద్యార్థిని పి.సూక్తిశ్రీ ఎంపికైనట్టు పాఠశాల ప్రిన్సిపల్ డి.భారతి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీకాళహస్తిలో ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో సూక్తిశ్రీ ప్రతిభ కనపరిచి రాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా ఎంపికై నట్టు వివరించారు. ఈనెల 22వ తేదీన ఢిల్లీలో జరగనున్న జాతీయస్థాయి స్కూల్‌గేమ్స్‌లో అండర్–14 బాలికల జట్టుకు కెప్టెన్‌గా ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపారు. పాఠశాల డైరెక్టర్ పి.యోగిరెడ్డి మాట్లాడుతూ జాతీయ స్థాయిలో విజయం సాధించి పల్నాడు జిల్లాకు, పాఠశాలకు పేరు తీసుకు రావాలని ఆకాంక్షించారు.


