స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేందుకు అడ్డదారులు తొక్కుతున్న కూటమి ప్రజా సమస్యలపై నిలదీస్తున్నందుకే అక్రమ కేసులు, రౌడీషీట్లు నా ఇంటిపై దాడి చేసిన వారిపై కేసుల్లేవు కూటమి అక్రమాలపై ఎన్నికల్లో పోరాటం చేస్తాం గుంటూరులో వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, నేతలు నూరి ఫాతిమా, పోతిన మహేష్
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించి, నిలదీస్తున్నందుకే వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు, రౌడీషీట్లు తెరిచి భయపెట్టాలని చూస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. అక్రమ కేసులకు తాము భయపడేది ప్రసక్తే లేదని, మున్సిపల్ ఎన్నికలపై ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్రోడ్డులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం కార్పొరేషన్ ఎన్నికలపై పార్టీ ముఖ్య నాయకులు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ విభాగాల నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడుతూ నగరపాలకసంస్థ ఎన్నికల వేళ వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ ప్రోద్బలంతో పోలీసులు రౌడీషీట్లు తెరిచేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గతంలో టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడికి పాల్పడ్డారని, డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని వైఎస్సార్ సీపీలో యాక్టివ్గా ఉన్న వారిపై రౌడీషీట్లు తెరవడం సిగ్గుచేటన్నారు. వైఎస్సార్ సీపీలో రౌడీలెవ్వరూ లేరని, తమ పార్టీలో నిజంగా రౌడీలుంటే టీడీపీ నేతలు స్వేచ్ఛగా తిరగగలరా అని ప్రశ్నించారు. పోలీసులకు నిజంగా చట్టం అంటే గౌరవముంటే గత జనవరి 31న వందలాది మంది గూండాలు, రౌడీలతో గుంటూరులోని తన ఇంటిపై ఏడున్నర గంటలపాటు దాడి చేయించిన టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావులపై రౌడీషీట్లు తెరవాలని సవాల్ విసిరారు. ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ రౌడీలకే రౌడీ అని, ఆయన కనుసన్నల్లోనే తన ఇంటిపై దాడి జరగడంతోపాటు ప్రశ్నించే గొంతుకలపై అక్రమ కేసులు మోపుతున్నారని మండిపడ్డారు. తన ఇంటిపై దాడికి పాల్పడిన టీడీపీ నేతలు అబ్బూరి మల్లి, ఇసుక బుజ్జి, రాయపాటి అమృతరావుపై రౌడీషీట్లు తెరవాలని, వారు పోలీసు కేసులు సైతం లేకుండా స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని అన్నారు. వైఎస్సార్ సీపీ నేతలపై రౌడీషీట్లు తెరిచి, అక్రమ కేసులతో జైళ్లకు పంపి మున్సిపల్ ఎన్నికల్లో దొంగఓట్లు వేయించుకునేందుకు టీడీపీ పన్నాగం పన్నిందన్నారు. తమపై అక్రమ కేసులు మోపి, భయపెట్టాలని చూసినా ఎన్నికల్లో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రెండున్నరేళ్ల కూటమి పాలనతో విసుగెత్తిపోయిన ప్రజలే పోలింగ్ బూత్లలో కూటమికి తగిన గుణపాఠం చెబుతారని ఆయన పేర్కొన్నారు. మహిళలపై రౌడీషీట్లు తెరిచిన ఘనత కూటమికే చెల్లుతుందని దుయ్యబట్టారు. అక్రమ కేసులు, రౌడీషీట్లపై తాము న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. బుధవారం జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం సమర్పిస్తామని అంబటి తెలిపారు.
వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు
అక్రమ కేసులు
వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి కార్పొరేషన్ ఎన్నికల్లో అక్రమంగా గెలవాలని కూటమి కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు. అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.
ప్రశ్నించే గొంతుకలపై రౌడీషీట్లు
వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంటు పరిశీలకుడు పోతిన మహేష్ మాట్లాడుతూ గుంటూరు నగర పాలక సంస్థలోని 76 వార్డుల్లో వైఎస్సార్ సీపీ తరపున కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తూ 400 మంది దరఖాస్తులు అందించారని చెప్పారు. ఈ విధంగా ఒక్కో వార్డు నుంచి ఐదారుగురు చొప్పున పోటీకి సిద్ధంగా ఉన్నారని వివరించారు. అధికారంలో లేకున్నా ప్రజల మద్దతు తమ పార్టీకి మెండుగా ఉందని అన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ మోసపూరిత హామీలు గుప్పించిన చంద్రబాబు వారిని నిలువునా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, ప్రత్తిపాడు, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తలు బలసాని కిరణ్కుమార్, వనమా బాల వజ్రబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ పాల్గొన్నారు.


