గుంటూరు వెస్ట్: ‘మార్పు’ కార్యక్రమం కింద చేపట్టిన వసతి గృహాల అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ిసీఎం సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీసీ హాలులో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మార్పు కార్యక్రమం కింద జిల్లాలో 36 వసతి గృహాలలో మౌలిక వసతులు కల్పించే లక్ష్యంతో పనులు చేపట్టామన్నారు. వసతి గృహాలు ప్రవేశాలు, వంట గదిలో విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. తాడికొండ, రాజా గార్డెన్లో వెంటనే బీసీ వసతి గృహం, గురుకులాల్లో పనులు తక్షణం ప్రారంభించాలని తెలిపారు. రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు చేయాలని, వాటి రూపురేఖలు మారాలని చెప్పారు. విద్యార్థులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించడమే లక్ష్యమన్నారు. మంచి వాతావరణం ద్వారా వ్యక్తిత్వ వికాసం కలుగుతుందని చెప్పారు. సమావేశంలో డ్వామా పీడీ వి.శంకర్, సోషల్ వెల్ఫేర్ డీడీ డి.దుర్గాబాయి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి కె.మయూరి, జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకుడు ఎన్.వెంకటరవణప్ప తదితరులు పాల్గొన్నారు.
గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు అరికట్టాలి
జిల్లాలో గర్భస్త లింగ నిర్ధారణ పరీక్షలు అరికట్టేందుకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీసీ హాలులో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం, సహాయక పునరుత్పత్తి సాంకేతికత చట్టం అమలు తీరుపై జిల్లాస్థాయి మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గర్భస్థ శిశువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. లింగనిర్దారణ పరీక్షలు అరికట్టేందుకు జిల్లాలో వైద్యశాలలు, స్కానింగ్ సెంటర్లపై డెకాయ్ ఆపరేషన్స్, ఆకస్మిక తనిఖీలు మరింత ముమ్మరంగా నిర్వహించాలన్నారు. స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను తప్పక పాటించాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడమంటే భ్రూణ హత్యలను ప్రోత్సహించడమేనని పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే వైద్యులు, స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కమిటీ సభ్యులు, ఎన్జీవోలు ఈ పరీక్షలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో అడిషనల్ సెషన్స్ డిస్ట్రిక్ జడ్జీలు వై.నాగరాజా, వెంకట నాగ శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎం. పద్మావతి, డీఎస్పీ సీతారామయ్య, ఐసీడీఎస్ పీడీ ప్రసూన, సభ్యులు పాల్గొన్నారు.
సాగు పద్ధతులపై పుస్తకం ఆవిష్కరణ
ఎల్నినో ప్రభావంతో రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా పంటలను రక్షించుకునే విధానంపై రూపొందించిన పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ మంగళవారం స్థానిక కలెక్టరేట్లో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉందని ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనిపై రూపొందిన పుస్తకాన్ని రైతులకు చేరవేయాలని అన్నారు. రైతులు పంటల సంరక్షణ చేసుకునే విధానం, తద్వారా ఆర్థికంగా నష్టపోకుండా చూడాలన్నారు. ప్రకృతి సేద్యం విధానంలో పంటల పరిరక్షణ చేసే అవకాశాలను విపులంగా వివరించాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, జిల్లా వ్యవసాయ అధికారి ఎం.పద్మావతి, ప్రకృతి వ్యవసాయం డి.పి.ఎం. రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ


