గుంటూరు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు

Oct 12 2026 3:49 AM | Updated on Oct 12 2026 3:49 AM

సోమవారం శ్రీ 12 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 పశ్చిమ డెల్టాకు నీటి విడుదల

న్యూస్‌రీల్‌

నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ కఠిన మార్గదర్శకాలు ఉల్లంఘించిన డాక్టర్లపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరిక వైద్య సమాజంలో తీవ్ర చర్చనీయాంశం

డాక్టర్ల అసంతృప్తి

సోమవారం శ్రీ 12 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్‌ నుంచి పశ్చిమ డెల్టాకు 2,423 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.

తెనాలి: డాక్టర్లు సోషల్‌ మీడియా మాధ్యమాల వినియోగం, ప్రచార ప్రకటనలపై నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎంసీ) ఆంక్షలు విధించింది. దీనికి సంబంధించి ఈ నెల ఆరో తేదీన పలు కఠినమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. కొన్ని నిబంధనలు, షరతులను స్పష్టంగా పేర్కొంది. ప్రత్యేకించి జెన్‌ జీ డాక్టర్లకు వరంలా ఉన్న సోషల్‌ మీడియా ప్రచారం ఇప్పుడు ఎన్‌ఎంసీ మార్గదర్శకాలతో ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం వైద్యుల సమాజంలో ఇదే అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ప్రచారంపై కఠిన మార్గదర్శకాలు...

ఎన్‌ఎంసీ ఆదేశాల ప్రకారం నూరుశాతం క్యూర్‌ లేదా గ్యారెంటీడ్‌ క్లెయిమ్స్‌ నిషేధం. ‘నూరు శాతం నయం చేస్తాం’, ‘గ్యారెంటీడ్‌ ట్రీట్‌మెంట్‌’, ‘మిరాకిల్‌ క్యూర్‌’, ‘నంబర్‌ వన్‌ డాక్టర్‌’ లేదా ‘బెస్ట్‌ స్పెషలిస్ట్‌’ వంటి నినాదాలతో ప్రకటనలు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. అలాగే చికిత్సకు ముందు, తర్వాత అంటూ రోగుల ఫొటోలు, సక్సెస్‌ స్టోరీలను ప్రచారానికి ఉపయోగించకూడదు. సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లతో ప్రచారాలు నిర్వహించడాన్ని కూడా నిషేధించింది. కృత్రిమ మేధతో సృష్టించిన నకిలీ పేషెంట్‌ టెస్టిమోనియల్స్‌, ఫేక్‌ ఫాలోవర్లు, మానిప్యులేటెడ్‌ రేటింగ్స్‌ను ఉపయోగించకూడదని పేర్కొంది. ఏఐ కంటెంట్‌ను ఉపయోగిస్తే దానికి వాటర్‌మార్క్‌ తప్పనిసరిగా ఉండాలని సూచించింది. వైద్య చికిత్సలపై క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు, ఉచిత పరీక్షలు, డిస్కౌంట్లు ప్రకటించడం కూడా నిషేధించింది. డాక్టర్లు సోషల్‌ మీడియాలో కేవలం తమ పేరు, విద్యార్హతలు, రిజిస్ట్రేషన్‌ నంబర్‌, ఫీజు వివరాలను మాత్రమే పంచుకోవాలని స్పష్టం చేసింది. ప్రజారోగ్య అవగాహన కల్పించే సందర్భంలో ఆస్పత్రిని ప్రమోట్‌ చేయకూడదని కూడా హెచ్చరించింది. నిబంధనలను ఉల్లంఘిస్తే, ప్రచారం తీవ్రత ఆధారంగా సంబంధిత డాక్టరును వైద్య మండలి రిజిస్టర్‌ నుంచి కొన్నేళ్లపాటు తొలగించే అవకాశం ఉంది.

వ్యాపార ధోరణికి వెళ్లకూడదనే...

ఎన్‌ఎంసీ విడుదల చేసిన మార్గదర్శకాల్లో తన ఉద్దేశాలను కూడా పొందుపరిచింది. పవిత్రమైన వైద్య వృత్తి వ్యాపార ధోరణిలోకి వెళ్లకూడదని, రోగులకు చికిత్స సక్రమంగా అందేలా చూడాలని స్పష్టం చేసింది. అబద్ధపు ప్రచారాలు, సోషల్‌ మీడియా పోస్టుల ద్వారా రోగులు ప్రలోభాలకు గురై ఇబ్బందులు పడకుండా చూడటమే లక్ష్యమని పేర్కొంది. ఆరోగ్య సంబంధిత సమాచారం నైతికంగా, ప్రమాణాలకు అనుగుణంగా అందించాలని, ఆస్పత్రుల ప్రకటనలు వృత్తిపరమైన నిబంధనల ప్రకారమే ఉండాలని తెలిపింది. పారదర్శకతతో కూడిన సాంకేతిక వైద్య సేవలను అందించడం, వైద్య వృత్తికి సంబంధించిన అన్ని విభాగాల్లో సమానమైన నైతిక విలువలను పెంపొందించడం ఈ మార్గదర్శకాల ఉద్దేశమని ఎన్‌ఎంసీ వివరించింది.

ఇవేం నిబంధనలు?

సాంకేతిక విప్లవం కొనసాగుతున్న ఈ తరుణంలో ఇలాంటి నిబంధనలు తగవని పలువురు డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. రెండు దశాబ్దాల క్రితం వరకు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసే సంస్కృతి లేదు. నయమైన రోగులు తమ ప్రాంతంలోని వారికి ఫలానా డాక్టర్‌ చాలా మంచి వైద్యుడని సూచించడం ద్వారా ప్రచారం జరిగేది. జెన్‌ జీ డాక్టర్ల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని చెబుతున్నారు. వారు వైద్య విద్యను అభ్యసించే సమయంలోనే సాంకేతిక విప్లవం ప్రారంభం కావడంతో, ఇంటర్నెట్‌ సదుపాయాన్ని ఉపయోగించుకుంటూ తమ సందేహాలను నివృత్తి చేసుకుంటూ వచ్చారు. డాక్టర్లుగా ప్రాక్టీస్‌ ప్రారంభించిన తర్వాత తమ అభిప్రాయాలను, విజయాలను, నూతన చికిత్స విధానాలను ప్రచారం చేసేందుకు సోషల్‌ మీడియాను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.

అల్లోపతికి మాత్రమేనా...?

ఎంబీబీఎస్‌లో ప్రవేశానికి నిర్వహించే నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీలపై ఎన్‌ఎంసీ, తన మండలి సభ్యులతో కలిసి ఎలాంటి నిరసనలు, పోరాటాలు చేయలేదని ఈ సందర్భంగా పలువురు ప్రస్తావిస్తున్నారు. కష్టపడి చదివి వైద్యులైన తమకు ఇటువంటి నిబంధనలు తీసుకురావడం బాధాకరమని పేర్కొంటున్నారు. ఈ నిబంధనలను కేవలం రిజిస్టర్డ్‌ అల్లోపతి వైద్యులకే వర్తింపజేసి, ఆయుర్వేద, హోమియోపతి వైద్యులను వీటి పరిధిలోకి తీసుకురాకపోవడం కూడా విమర్శలకు దారితీస్తోంది.

ఈ మార్గదర్శకాలపై వైద్య సమాజంలో పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎంబీబీఎస్‌ సీటు సాధించడానికి ఏళ్ల తరబడి కష్టపడి, నిద్రాహారాలు మాని చదువుకున్నామని గుర్తుచేస్తున్నారు. సీటు వచ్చిన తర్వాత కూడా సంవత్సరాలపాటు పుస్తకాలతో కుస్తీ పడుతూ, కుటుంబ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉండి చదివామని పేర్కొంటున్నారు. అలాంటి తమను సామాజిక మాధ్యమాల్లో తమ విజయాలను ప్రకటించకూడదని చెప్పడం నిరాశ కలిగిస్తోందని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ డాక్టర్‌ అన్నారు. తమ వైద్యంతో ప్రాణాలు నిలబెట్టిన సందర్భాలను, ఏ చికిత్స ద్వారా రోగులు కోలుకున్నారో సామాజిక మాధ్యమాల్లో ప్రకటించకూడదని చెప్పడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రోగులు ప్రాణాపాయ స్థితిలో ఎలాంటి పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చారు? చికిత్సకు ముందు తీసిన వీడియోలు, ఫొటోలు, వైద్యం అనంతరం కోలుకున్న రోగుల అభిప్రాయాలను వారి సమ్మతితో ప్రచురించడంలో అనైతికత ఏముందని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement