దసరా మహోత్సవాలు ప్రారంభం అమ్మవారిని దర్శించుకున్న భక్తులు
పెదకాకాని: మల్లేశ్వరస్వామి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా తొలిరోజు భ్రమరాంబదేవి అమ్మవారు కదంబవనవాసినీదేవి అలంకారంలో భక్తులు దర్శమిచ్చారు. ఆలయ స్థానాచార్యులు పొత్తూరి సాంబశివరావు, ప్రధాన అర్చక పొత్తూరి లక్ష్మీనారాయణ వరప్రసాద్ పర్యవేక్షణలో వేదపండితులు, అర్చక స్వాములచే ప్రాతఃకాల అర్చన, అభిషేకం, పంచహారతులు, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, పంచగవ్యప్రాశన, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, నవావరణార్చనలు జరిగాయి. భ్రమరాంబదేవి అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు, పంచహారతులు, ఆలయ ప్రదక్షిణ నిర్వహించారు. యాగశాలలో భక్తులు రుద్ర, చండీ హోమాలు జరిపించుకున్నారు. భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారు.
సాంస్కృతిక కార్యక్రమాలు
సాయంత్రం 5.30 గంటలకు కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కడవకొల్లు వీరవల్లి గ్రామ వాసులు కుక్కల విజయలక్ష్మి, గీతాకృష్ణ భజన సమాజ బృందం వారిచే భజన కాలక్షేపం, విజయవాడకు చెందిన పీవీఏ ప్రసాద్ ఆధ్వర్యంలో భక్తిరంజని నిర్వహించారు. పెదకాకాని కళాశ్రీ డ్యాన్స్ అకాడమి వారిచే కూచిపూడి నృత్యం, పెదకాకానికి చెందిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గణపతి మహత్యం నాటకం ప్రదర్శించారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్, పాలకమండలి చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు, పాలకమండలి సభ్యులు కొమ్మూరి మల్లికార్జునరావు, బండారు మల్లేశ్వరి, ఉల్లం రాజేశ్వరి, కొండ లత, పాముదుర్తి నాగ లక్ష్మి, ధూపాటి శివశంకరరావు, ఎక్స్ అఫిషియో సభ్యుడు పేటేటి ధనమహేశ్వరప్రసాద్, భక్తులు పాల్గొన్నారు.
నేడు బాలా త్రిపురసుందరిదేవిగా అమ్మవారు
పెదకాకాని శివాలయంలో దసరా నవరాత్రోత్సవాల్లో భాగంగా రెండవరోజు సోమవారం భ్రమరాంబ అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులను అనుగ్రహిస్తారని అధికారులు ఆదివారం తెలిపారు.


