తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ఆదివారం శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజైన ఆదివారం మహాలక్ష్మి అమ్మవారికి ఉదయం తొమ్మిది గంటలకు విశేష అభిషేక మహోత్సవం, కుంకుమార్చన నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, పల్లకీసేవ, అర్చన, నివేదన, మంగళా శాసనం కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి మంగళాశాసనాలతో ఈనెల 20వ తేదీ వరకు శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు తరలిరావాలని కోరారు.
బాపట్ల: ప్రసిద్ధ చందోలు బగళా ముఖి అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు ఆదివారం జరిగాయి. అమ్మవారి శరత్కాల చోటస మహా యజ్ఞ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తొలుత మంగళ వాయిద్యాల వేద స్వస్తితో ఆలయ పూజారులు, వేద పండితులు, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ మహాగణపతి ఆరాధనతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి బాలా త్రిపుర సుందరిగా అలంకరించారు. భక్తులు పెద్దసంఖ్యలో దర్శించుకున్నారు. ఆలయ ముందు భాగంలో ప్రత్యేకంగా నిర్మించబడిన యజ్ఞ వాటికలో హోమం చేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాలకు ప్రధాన ఉభయ దాతలుగా తెల్లబాటి శ్రీనివాసరావు దంపతులు వ్యవహరించారు. చందోలు గ్రామానికి సంబంధించి ఆర్యవైశ్య మహిళా బృందం తరఫున 116 మంది పాల్గొన్నారని ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కలకోట చక్రధర్ రెడ్డి, ఈవో జి. నరసింహమూర్తి తెలిపారు.
అమ్మవారిని దర్శించుకున్న భక్తులు
అమరావతి: స్థానిక బాలచాముండిక సమేత అమరేశ్వర ఆలయంలో శ్రీదేవీ శరన్నవరాత్ర మహోత్సవాలలో భాగంగా ఆదివారం తొలిరోజు బాలా త్రిపుర సుందరిదేవి అలంకారంలో బాల చాముండేశ్వరి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పూజా కార్యక్రమాలలో భాగంగా చండీ, రుద్రహోమాలు, శ్రీచక్రార్చన నిర్వహించారు. ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ మాల్లాడుతూ బాలా త్రిపురసుందరిదేవి అలంకార విశిష్టతను వివరించారు. ఆలయంలోని జ్వాలాముఖి, మహిషాసురమర్ధని అమ్మవార్లకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి బాలా త్రిపురసుందరిదేవి అలంకారం చేసి ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలను సందర్శించి, ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు.
విజయవాడ, తిరుపతి
మధ్య ప్రత్యేక రైలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దసరా రద్దీ తో ప్రత్యేక రైలు నడపనున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్‌ఓ ఆదివారం ప్రకటలో తెలిపారు. 07249 నంబరు ప్రత్యేక రైలు ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు రోజు ఉదయం 9.30 గంటలకు విజయవాడలో బయలుదేరి, సాయంత్రం 7 గంటలకు తిరుపతి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 07250 నంబరు రైలు రాత్రి 9.10 గంటలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. పెద్దవడ్లపూడి, దుగ్గిరాల, తెనాలి, నిడుబ్రోలు, బాపట్ల, చీరాల, చినగంజాం, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంటలో ఆగుతుంది.


